నంది అవార్డుల ప్రదానం
2008 చలనచిత్ర నంది అవార్డుల ప్రదానోత్సవం హైద్రాబాద్ లోని లలిత కళాతోరణంలో ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం సాయంత్రం కన్నులపండువగా జరిగింది. ముఖ్యమంత్రి కె.రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి డాక్టర్ జి.గీతారెడ్డి కూడా హాజరయ్యారు. ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డును ప్రముఖ నటి జమున అందుకున్నారు. ఈ అవార్డు కింద ఆమెకు రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేశారు. బీఎన్ రెడ్డి జాతీయ చలనచిత్ర అవార్డును సీనియర్ దర్శకుడు కె.బి.తిలక్ అందుకున్నారు. ఈ అవార్డు కింద రూ.2 లక్షల నగదు, పశంసాపత్రం ఆయనకు అందజేశారు. నాగిరెడ్డి, చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డును ఐమాక్స్ థియేటర్ యజమాని ఎ.రమేష్ ప్రసాద్ అందుకున్నారు. రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు కింద రూ.2 లక్షల నగదు, ప్రశంసాపత్రాన్ని ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల అందుకున్నారు.
ఉత్తమ దర్శకుడుగా రాథాకృష్ణ (క్రిష్), ఉత్తమ నటుడుగా రవితేజ, ఉత్తమ నటిగా స్వాతి, ఉత్తమ విలన్ గా సోనూసూద్ అవార్డులు అందుకున్నారు. అల్లు రామలింగయ్య ఉత్తమ హాస్యనటుడు అవార్డును డాక్టర్ బ్రహ్మానందం అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రోశయ్య స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడూ కట్టుబడి ఉన్నాయనీ, ఇక నుంచి ఏయేటికాయేడు నంది అవార్డులు ప్రదానం చేసేందుకు చర్యలు తీసుకువాలని సినిమాటోగ్రఫీ మంత్రికి, అధికారులకు సూచించిటనట్టు తెలిపారు. అలాగే పేరసీ వల్ల చిత్ర పరిశ్రమ నష్టపోకుండా చట్టాలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందనీ, పైరసీ నియంత్రణకు ఏ చట్టం కఠినంగా లేకపోయినా తమ దృష్టికి తీసుకురావాలని పరిశ్రమ పెద్దలకు సూచించారు.
Be first to comment on this News / Article!
|