విష్ణుతో 'పెదరాయుడు-2'
బాలీవుడ్ లో సీక్వెల్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. తెలుగులో ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ మొదలైంది. చిరంజీవి 'శంకర్ దాదా ఎంబిబిఎస్'కు సీక్వెల్ గా 'శంకర్ దాదా జిందాబాద్', అల్లు అర్జున్ 'ఆర్య'కు సీక్వెల్ గా 'ఆర్య-2' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్ చరణ్ తో 'జగదేకవీరుడు అతిలోక సుందరి-2' ఆలోచన ఉందని అశ్వనీదత్ ఆమధ్య ప్రకటించారు. తాజాగా మంచు ఫ్యామిలీ హీరో విష్ణు కథానాయకుడుగా 'పెదరాయుడు-2' చిత్రానికి ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలిసింది.
డాక్టర్ ఎం.మోహన్ బాబు, రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన 'పెదరాయుడు' చిత్రం అప్పట్లో పెద్ద సక్సెస్ సాధించింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందింది. తాజాగా విష్ణుకు సైతం ఓ హిట్ అనివార్యమవుతోంది. ఎన్నో అంచనాలతో ఇటీవల విడుదలైన 'సలీమ్' బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూడటంతో ఎలాగైనా మళ్లీ ఓ సరైన హిట్ కొట్టాలనే పట్టుదలతో విష్ణు ఉన్నాడు. ఇందులో భాగంగానే 'పెదరాయిడు-2' చిత్రానికి ఆయన సన్నద్ధమవుతున్నారనీ, మళ్లీ రవిరాజా పినిశెట్టికే దర్శకపగ్గాలు అప్పగించనున్నారనీ తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు రవిరాజా పినిశెట్టి వద్ద అసిస్టెంట్ గా పనిచేసి, ఇటీవల బాలీవుడ్ లో ఓ హారర్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా విష్ణు కమిట్ అయినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన పూర్తవివరాలు వెల్లడి కానున్నాయి.
Read 3 Comment(s) posted so far on this News / Article!
|