'పైరసీ' పై ఆమరణ దీక్ష
తెలుగు సినీ పరిశ్రమ నవనాడులూ కుంగిపోయేలా చేస్తున్న పైరసీ భూతంపై చిత్ర పరిశ్రమ తీవ్ర ఆందోళన చెందుతోంది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తే విడుదలైన మరుసటి రోజే పైరసీ భూతం జడలు విప్పడం వారిని తీవ్ర ఆవేదనలో ముంచెత్తుతోంది. చట్టాలు ఉన్నా కఠినంగా లేకపోవడం వల్లనో మరో కారణం వల్లనే పరిశ్రమ మనుగడ ప్రమాదంలో పడుతోందంటూ పరిశ్రమకు చెందిన పలువురు ఆందోళనా పథంలోకి దిగుతున్నారు. నిర్మాత యలమంచి రవిచంద్ ('మాయగాడు' నిర్మాత) మరో అడుగు ముందుకు వేసి హైద్రాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నాను. బుధవారంతో ఆయన నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకోవడంతో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆయనకు తమ సంఘీబావం తెలిపారు.
పైరసీని అరికట్టడంలో చట్టాలు మరింత కఠినంగా వ్యవహారించాల్సిన అవసరం కనిపిస్తోందనీ, దీనిపై 24 క్రాఫ్ట్ కు చెందిన వారంతా భవిష్యత్ కార్యాచరణకు దిగబోతున్నారనీ పలువురు సినీ ప్రముఖులు దీక్షా శిబిరంలో తెలియజేశారు. ఒకరోజు పరిశ్రమకు చెందిన అన్ని కార్యక్రమాలు నిలిపి వేయడమో, భారీ ప్రదర్శన తీసి ముఖ్యమంత్రిని కలుసుకుని విజ్ఞప్తి చేయడమో చేయబోతున్నట్టు వారు తెలిపారు. దర్శకుడు సురేందర్ రెడ్డి బుధవారంనాడు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన సినీ ప్రముఖులలో అక్కినేని నాగార్జున, నాగచైతన్య, రామ్, తమ్మారెడ్డి భరద్వాజ, కె.సి.శేఖర్ బాబు, డివివి దానయ్య, తేజ, కృష్ణవంశీ, విజయ్ చందర్, మురళీ మోహన్, వి.వి.వినాయక్, బెల్లంకొండ సురేష్, డి.సురేష్ బాబు, దిల్ రాజు, నల్లమలుపు బుజ్జి, శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రసన్నకుమార్ తదితరులు ఉన్నారు.
Be first to comment on this News / Article!
|