రానా ద్విభాషా చిత్రం
శేఖర్ కమ్ముల 'లీడర్' చిత్రం ద్వారా హీరోగా పరిచయమై ఆరడుగుల అందగాడుగా ప్రేక్షకాదరణ చూరగొన్న రానా ఇప్పుడు బహుభాషా నటుడిగా కూడా తన సత్తా చాటుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన 'దమ్ మారో దమ్' చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. రోహన్ షిప్పీ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ తో కలిసి రానా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. తాజాగా రానా హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ కొత్త చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది.
దీనికి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించనున్నారు.
సెల్వ రాఘవన్ '7/జి బృందావన్ కాలనీ', 'ఆడవారి మాటలకు ఆర్ధాలు వేరులే' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఇటీవలే ఆయన ద్విభాషా చిత్రం 'యుగానికి ఒక్కడు' చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఆ చిత్రం తర్వాత తమిళ స్టార్ హీరో విక్రమ్ తో ఓ చిత్రాన్ని ఆయన చేయబోతున్నారు. జూలై లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రానాతో నిర్మించనున్న చిత్రానికి కూడా సెల్వరాఘవన్ కమిట్ అయ్యారు. ఇందులో రానాకు జోడిగా ఆండ్రియా ('యుగానికి ఒక్కడు' ఫేమ్) ఎంపికైనట్టు సమాచారం. ఏప్రిల్ లో ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ సెట్స్ పైకి రాబోతోంది.
Be first to comment on this News / Article!
|