'చంద్రముఖి-2'లో అనుష్క
తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన 'చంద్రముఖి' చిత్రానికి దర్శకుడు పి.వాసు సీక్వెల్ చేయనున్నారనే వార్త బయటకు వచ్చినప్పటికీ 'చంద్రముఖి-2' అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ఇంకా షూటింగ్ ప్రారంభం కానప్పటికీ ఇందులో హీరో ఎవరై ఉంటారనే రసవత్తరమైన చర్చ జరుగుతూ వచ్చింది. రజనీకాంత్, చిరంజీవి పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఎట్టకేలకు ఆ సస్పెన్స్ కు తెరపడి తెలుగు వెర్షన్ లో వెంకటేష్ కథానాయకుడుగా ఎంపికయ్యారు. తాజాగా ఈ చిత్రంలో కథానాయిక ఎవరనే సస్పెన్స్ కు కూడా దాదాపు తెరపడినట్టే. ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడిగా అందాల నటి అనుష్క పేరును వాసు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
'అరుంధతి' చిత్రం తర్వాత అనుష్కకు ఇటు తెలుగులోనూ, ఆ చిత్రం తమిళ వెర్షన్ తో కోలీవుడ్ లోనూ ఆమెకు మంచి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'పంచాక్షరి'లో నటిస్తున్న అనుష్కను పి.వాసు అప్రోచ్ అయ్యారనీ, వెంకటేష్ సరసన నటించేందుకు ఆమె వెంటనే తన సమ్మతి తెలియజేసిందనీ తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బెల్లకొండ సురేష్ నిర్మించనున్నారు. కన్నడంలో విజయవంతమైన 'ఆప్తరక్షక' చిత్రానికి ఇది రీమేక్ కానుంది. 'ఆప్తరక్షక' చిత్రం ఇటీవలే కన్నడంలో విడుదలై 40 కోట్లకు పైగా వసూలు చేసి కన్నడ చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాస్తోంది. ఆ చిత్రంలో విమలారామన్ చేసిన పాత్రనే ఇప్పుడు తెలుగులో అనుష్క పోషించనుంది.
Be first to comment on this News / Article!
|