300 ప్రింట్లతో 'వరుడు'
స్టయిలిష్ హీరో అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన 'వరుడు' చిత్రం భారీ అంచనాలతో ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని 300కు పైగా ప్రింట్లతో విడుదల చేయబోతున్నారు. వీటిలో 65 వరకూ డిజిటల్ ప్ర్రింట్లు ఉండబోతున్నాయి. అల్లు అర్జున్, చిత్ర కథానాయిక (పేరు ఇంకా వెల్లడించలేదు), 50 మంది డాన్సర్లపై 'ఖమ్మం దాటి వచ్చేసాక..'అనే చివరి పాటను అమ్మరాఖర్ దర్శకత్వంలో ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. యూనివర్శల్ మీడియా పతాకంపై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అల్లు అర్జున్ తో 'దేశముదురు' వంటి సెన్సేషన్ హిట్ తర్వాత తమ బ్యానర్ నుంచి వస్తున్న ఈ చిత్రం అంతకంటే మించే స్థాయిలో ఉంటుందనీ, ఈ చిత్రం విడుదలైన తర్వాత అంతా అల్లు అర్జున్ పాత్ర గురించే ముచ్చటించుకుంటారనీ దానయ్య చెబుతున్నారు. ఇప్పటికే ఆడియో పెద్ద హిట్ కావడంతో సినిమా సక్సెస్ పై మరింత నమ్మకం పెరిగిందన్నారు. సెన్సార్ ముగించి ఈనెల 31న సినిమా రిలీజ్ చేస్తామన్నారు. అల్లు అర్జున్ కు జోడిగా ఓ కొత్తమ్మాయిని పరిచయం చేస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. నటి స్నేహ ఉల్లాల్ ఓ స్పెషల్ సాంగ్ లో నర్తించినట్టు సమాచారం. నిజజీవితంలోని 100 కుటుంబాలకు చెందిన సభ్యులంతా ఇందులో కనిపించనుండటం విశేషం. సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరికొందరు ప్రముఖ నటులు కూడా గెస్ట్ లుగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి వేటూరి పాటలు, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, ఆంధోని ఎడిటింగ్, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|