భూమిక మహిళా ఉద్యమం
మహిళా హక్కుల కోసం నటి భూమిక ఉద్యమించి హైద్రాబాద్ లో హల్ చల్ చేసింది. అయితే ఇదంతా 'కలెక్టర్ గారి భార్య' చిత్రం కోసమే. ప్రకాష్ రాజ్, భూమిక జంటగా అమోద్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వి.వనితా రాణి, వి.రాధికారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సకుటుంబ సమేతంగా చూడదగిన చిత్రంగా దీనిని దర్శకుడు టేకుల కృపాకర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం కోసం 'చేయి చేయి కలిపి కదలవే...మగవానితో సమ హక్కులు పొందేవరకు' అనే పల్లవితో సాగే గీతాన్ని భూమికపై హైద్రాబాద్ రోడ్లపై చిత్రీకరించారు. భూమిక తో పాటు సుమారు 500 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. పైడిశెట్టి రామ్ రచన చేసిన ఈ గీతానికి శివశంకర్ నృత్యరీతులు కూర్చారు. మహిళలు తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం, సమానత్వం, హక్కుల కోసం చేస్తున్న ఉద్యమానికి భూమిక నాయకత్వం వహించే నేపథ్యంలో ఈ గీతం వస్తుందని దర్శకుడు వివరించారు. ఇందులో కలెక్టర్ గా ప్రకాష్ రాజ్, ఎంబిఎ గోల్డ్ మెడలిస్ట్ అయిన ఇందిర పాత్రలో భూమిక నటిస్తున్నారనీ, భార్యాభర్తలయిన వీరి మధ్య చోటుచేసుకునే సంఘటనలు ప్రతి కుటుంబాన్ని ఆలోచించపజేస్తాయనీ చెప్పారు. ఈ నెలాఖరుకు షూటింగ్ పూర్తవుతుందనీ, ఏప్రిల్ మొదటి వారంలో ఆడియో, మే నెలలో సినిమా విడుదలవుతుందనీ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు, వేణుమాధవ్, కొండవలస, బాబూమోహన్, గుండు హనుమంతరావు, వైజాగ్ ప్రసాద్, మల్లాది రాగవ, మేల్కొటె, శివపార్వతి, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు. పరుచూరి సోదరులు రచన, పైడిశెట్టి రాము పాటలు, పూర్ణకాండ్రు సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, చిన్నా సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|