'ఆకాశరామన్న' సక్సెస్ మీట్
అల్లరి నరేష్, శివాజీ, రాజీవ్ కనకాల, మీరాజాస్మిన్, గౌరీపండిట్ ప్రధాన పాత్రల్లో అశోక్ దర్శకుడిగా మన్నెం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మన్నెం రమేష్ నిర్మించిన 'ఆకాశరామన్న' చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ను ఫిలిం చాంబర్ లో నిర్వహించింది. శివాజీ, అల్లరి నరేష్, రాజీవ్ కనకాల, అశోక్, మన్నెం రమేష్ పాల్గొన్నారు.
శివాజీ మాట్లాడుతూ, ఈ చిత్రంలో ఐపిఎల్ క్రికెట్ టీముల్లా కొన్ని టీమ్ లు ఉంటాయనీ, ఇవన్నీ వినోదాన్ని పంచుతాయనీ అన్నారు. ఈ చిత్ర నిర్మాత మన్నెం రమేష్ సినిమాను ప్రేమించే వ్యక్తి అనీ, సినిమా రిలీజ్ కు ముందు ఆయనెంతో కష్టపడ్డారనీ, రిలీజ్ తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారనీ తెలిపారు. ఈ చిత్రం తప్పనిసరిగా 100 రోజులు ఆడుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. ఇండియన్ సినిమాలలో ఇంతవరకూ ఇలాంటి వెరైటీ కాన్సెప్ట్ తో సినిమా రాలేదనీ, ఒక రకంగా చెప్పాలంటే ఇది మోడ్రన్ 'మాయాబజార్' అనీ అల్లరి నరేష్ అభివర్ణించారు. రివర్స్ స్క్రీన్ ప్లే తో రూపొందిన చిత్రమిదని రాజీవ్ కనకాల అన్నారు. కొందరు సినిమా ప్రథమార్థం బాగుందనీ, మరికొందరు ద్వితీయార్థం బావుందనీ, మరికొందరైతే కథ అర్ధం కాలేదని అంటున్నారనీ అన్నారు. అయితే సినిమా అర్ధం కాకపోవడానికి ఏమీ లేదనీ, స్క్రీన్ ప్లే పరంగా కథ ముందుకు వెనక్కు వెళ్తుంటుందనీ, మరోసారి సినిమా చూస్తే చాలా బాగా అర్ధమవుతుందని అన్నారు. కొత్త ట్రెండ్ కు ఈ చిత్రం నాంది పలికిందని పేర్కొన్నారు. దర్శకుడు అశోక్ మాట్లాడుతూ, ఈ కథ విన్న తర్వాత నిర్మాత కథకు తగ్గ నటీనటులను ఎన్నుకుని చాలా జాగ్రత్తగా నిర్మాణం చేపట్టారనీ, ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందనీ అన్నారు. మన్నెం రమేష్ మాట్లాడుతూ, ఈ సినిమాను చిత్రిక పట్టడంలో దర్శకుడు ఎంతో జాగ్రత్త తీసుకున్నారనీ, ఉగాదికి నాలుగు రోజులు ముందు విడుదలైన ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ తన కృతజ్ఞతలనీ అన్నారు.
Be first to comment on this News / Article!
|