'ఎకో'పై ఇళయరాజా ఫిర్యాదు
దక్షిణ భారత సినీ రంగంలో ప్రముఖ సంగీత దర్శకుడైన ఇళయరాజా ఎకో రికార్డింగ్ కంపెనీ పై చెన్నై పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఆయన సంగీత సారథ్యంలో వచ్చిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. ఆ చిత్రాల్లోని సంగీతాన్ని ఆడియో క్యాసెట్లు, సీడీల రూపంలో విడుదల చేసే అధికారాన్ని 30 ఏళ్ల కాలపరిమితితో ఎకో రికార్డింగ్ సంస్థకు ఆయన ఇచ్చారు. ఇళయరాజా, ఆయా చిత్రాల నిర్మాతల అంగీకారంతోనే ఈ ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందం ప్రకారం రాయల్టీ మొత్తాన్ని చెల్లించడంలో ఆ సంస్థ విఫలమైందంటూ ఇళయరాజా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇళయరాజా తన ఫిర్యాదుకు ముందు ఈ విషయాన్ని నిర్మాతల మండలి దృష్టికి కూడా తీసుకువచ్చారు. ఎకో సంస్థ తాను చేసిన తెలుగు చిత్రాల హక్కులను వేరే కంపెనీకి రూ.25 కోట్లకు విక్రయించే ప్రయత్నాలు చేసినట్టు కూడా తన దృష్టికి వచ్చిందని ఇళయరాజా ఆరోపించారు. తమకు చెల్లించాల్సిన రాయిల్టీ, ఇతర విషయాల గురించి పలుమార్లు చేసిన విజ్ఞప్తులను ఎకో సంస్థ పెడచెవిన పెట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. తనను, తన నిర్మాతలను మోసం చేస్తున్న ఆ సంస్థపై చర్య తీసుకోవాలని ఆయన పోలీసు కమిషనర్ ను కోరారు.
Be first to comment on this News / Article!
|