'మాయాబజార్' 50 వేడుక
దిగ్దర్శకుడు కె.వి.రెడ్డి దర్శకత్వంలో విజయా బ్యానర్ పై నాగిరెడ్డి-చక్రపాణి నిర్మించిన ఓల్డ్ క్లాసిక్ 'మాయాబాజర్' ఇటీవల గోల్డ్ స్టోన్ టెక్నాలజీ అందించిన కలరైజేషన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ వేడుకను హైద్రాబాద్ లో నిర్వహించారు. 'మాయాబజార్' చిత్ర కథనాయకుల్లో ఒకరైన ఫాల్కే అవార్డు గ్రహిత, పద్మభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు హాజరయ్యారు. కలరైజేషన్ క్రియేటివ్ డైరెక్టర్ సి.జగన్మోహన్, గోల్డ్ స్టోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిబి శ్రీనివాస్, స్వర్గీయ సిఎస్ఆర్ మనవడు నటరాజు, లగడపాటి శ్రీదర్, హీరో సుశాంత్, సీనియర్ సినీ పాత్రికేయులు బి.ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు.
అక్కినేని మాట్లాడుతూ, మాయాబజార్ ఎప్పుడూ కలర్ ఫుల్ సినిమానేననీ, సినిమా బతికున్నంత కాలం మాయాబజార్ నిలుచుండే సినిమా అనీ అన్నారు. కలరైజేషన్ చేసిన గోల్డ్ స్టోన్ వారు అభినందనీయులనీ, ప్రేక్షకులు మరోమారు సినిమాను ఆదరించి తమ అభిరుచిని చాటుకున్నారనీ అన్నారు. ఈ దృశ్యకావ్యాన్ని కలర్ లో చూసి ఆశ్చర్యపోయినట్టు సుశాంత్ పేర్కొన్నారు. సినిమా ఉన్నంత కాలం మాయాబజార్ గురించి చెప్పుకుంటారనీ బిఎ రాజు పేర్కొన్నారు. తమ తొలి ప్రయత్నాన్ని ఆదిరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని సి.జగన్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ కు అక్కినేని చేతుల మీదుగా సత్కారం జరిగింది. అలాగే అక్కినేనిని కూడా ఈ వేడుకలో ఘనంగా సన్మానించారు.
Be first to comment on this News / Article!
|