రామ్ కొత్తచిత్రం షురూ
యువహీరో రామ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషనలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ ఓ కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జెనీలియా కథానాయిక. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో సోమవారం జరిగింది. రామ్ పై చిత్రీకరించన ముహూర్తం సన్నివేశానికి డాక్టర్ దాసరి నారాయణరావు క్లాప్ ఇవ్వగా, నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరో రవితేజ గౌరవ దర్శకత్వం వహించారు.
సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, సినిమా అంటే తనకు ఎనలేని మక్కువనీ, కెరీర్ పరంగా ఇది తన ఐదవ చిత్రమనీ చెప్పారు. గతంలో తాను తీసిన చిత్రాలన్నింటికంటే ఈ సినిమా మరింత బాగుంటుందన్నారు. హీరో రామ్ లో మంచి ఎనర్జీ ఉందని అన్నారు. తన చిత్రానికి చక్రి పనిచేస్తుండటం ఇదే మొదటిసారనీ, కిక్ సినిమాకు అద్భుతమైన ఫోటోగ్రఫీ అందించిన రసూల్ అంతకంటే ఈ చిత్రాన్ని మరింత అందంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారనీ చెప్పారు. చాలా మంచి టీమ్ తో ఈ చిత్రం చేస్తుండటం ఆనందంగా ఉందని అన్నారు. రవికిషోర్ మాట్లాడుతూ, రామ్ తో రెడీ, గణేష్ చిత్రాల తర్వాత తాను నిర్మిస్తున్న మూడో సినిమా ఇదనీ, మే 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందనీ చెప్పారు. సురేందర్ రెడ్డి మంచి టెక్నీషియన్ అనీ, అతిథి చిత్రం తర్వాత అతనితో ఓ సినిమా చేయాలనుకున్నప్పటికీ ఇప్పటికి కుదిరిందని అన్నారు. హాలీవుడ్ తరహాలో స్టైలిష్ టేకింగ్ తో ఈ సినిమా ఉంటుందన్నారు. రామ్ మాట్లాడుతూ, సురేందర్ రెడ్డి మంచి టేకింగ్ తో గ్రాఫిక్స్, ఎఫెక్ట్ వంటి అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. ఇందులో హీరో పాత్ర ఒక కమిట్ మెంట్ తో చివరి దాకా పోరాడేలా ఉంటుందని మాటల రచయిత కోన వెంకట్ తెలిపారు. ఎక్కువ సమయం తీసుకుని స్క్రిప్టు తయారు చేసినట్టు కథా రచయిత వక్కంతం వంశీ చెప్పారు. ఈ బ్యానర్ లో సంగీత దర్శకుడు తనకు తొలి చిత్రమని, రామ్ తో మూడో సినిమా అనీ చక్రి తెలిపారు. రసూల్, రామ్ సోదరుడు చైతన్య ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|