ఛార్మి 'మంగళ' ప్రారంభం
ఛార్మింగ్ గాళ్ ఛార్మి కథానాయికగా రూపొందుతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'మంగళ'. ఈ చిత్రానికి 'మంత్ర' తులసీరామ్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారంనాడు జరిగింది. ఛార్మిపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇవ్వగా, యువ కథానాయకుడు సాయిరాం శంకర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
తులసీరామ్ మాట్లాడుతూ, మంత్ర సినిమాలో గ్రాఫిక్స్ లేకుండానే ప్రేక్షకులను భయపెట్టామనీ, ఇది మాత్రం గ్రాఫిక్స్ కు ప్రాధాన్యం ఉన్న సస్నెన్స్, థ్రిల్లర్, హారర్ చిత్రమని చెప్పారు. తప్పుకుండా ఈ చిత్రం ప్రేక్షకులను భయపెడుతుందనీ, మంత్ర కన్నా పెద్ద హిట్టవుతుందనే నమ్మకం తనకుందనీ అన్నారు. ఏప్రిల్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. హైద్రాబాద్, తలకోన లొకేషన్లలో షూటింగ్ జరుపుతామన్నారు. ఇందులో నాలుగు పాటలు ఉంటాయనీ, ఒక రీమిక్స్ టైటిల్ సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు. ఛార్మి మాట్లాడుతూ, తన కెరీర్ లో ఇదొక మంచి చిత్రమనీ, మంత్ర కంటే రెట్టింపు హిట్టవుతుందనీ పేర్కొంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టయిన మంత్ర చిత్రంలా ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని సాయిరామ్ శంకర్ అభిలషించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు సుకుమార్ పేర్కొన్నారు. గాయకుడిగా, గేయరచయితగా 70 సినిమాలు చేసిన తనకు సంగీత దర్శకుడుగా ఇది తొలిచిత్రమని చిత్ర సంగీత దర్శకుడు విశ్వ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సుభాష్, విజయ్, ప్రదీప్ రావత్, యువరాజ్, ఆనంద భారతి తదితరులు నటించనున్నారు. జంధ్యం వెంకటేష్ బాబు మాటలు, శివేంద్ర సినిమాటోగ్రఫీ, శీను ఎడిటింగ్, గణేష్ ఫైట్స్ అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|