యుఎస్ లో సుప్రీం 'సింహా'
నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం 'సింహా'. నయనతార, నమిత, స్నేహ ఉల్లాల్ కథానాయికలు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అమెరికాలో పంపిణీ చేసే హక్కులను సుప్రీం మూవీస్ అధినేత రాజు హర్వాణి పొందారు. హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజు హర్వాణి, చిత్రయూనిట్ ఆ విశేషాలను తెలియజేసింది.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, కథకు సింహా అనేది సరైన టైటిల్ అనీ, ఒక ప్రేక్షకుడుగా బాలయ్యబాబును ఏవిధంగా చూపించాలో తనకు బాగా తెలుసనీ, ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని ఈ స్క్రిప్టు రూపొందించామనీ చెప్పారు. ఆయన అభినయమే ఈ చిత్రానికి హైలైట్ గా ఉంటుందన్నారు. అన్నిరకాల భావోద్వేగాలు ఆయన పాత్రలో ఉంటాయని చెప్పారు. పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ, ఇందుకు ముందు తమ సంస్థ నుంచి వచ్చిన చిత్రాలు కమర్షియల్ గా ఆడకపోవడంతో నిరాశలో ఉన్న తమకు బాలయ్య బాబు డేట్స్ ఇచ్చారనీ, తమ నమ్మకానికి తగ్గట్టే బోయపాటి ఈ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారనీ తెలిపారు. సినిమా ఓవర్ బడ్జెట్ అయిందనుకుంటున్న తరుణంలో రాజు హర్వాణి వచ్చి ఓవర్సీస్ రైట్స్ తీసుకుని మొత్తం సొమ్ము చెల్లించారని, ఇందుకు గాను రాజు హర్వాణికి తన కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాననీ అన్నారు. సుప్రీం రాజు మాట్లాడతూ, ఇంతకుముందు తాను మగధీర, ఆర్య-2 చిత్రాలను అమెరికాలో పంపిణీ చేశాననీ, రెండు చిత్రాలు చాలా బాగా ఆడాయనీ అన్నారు. సింహా చిత్రం కూడా మంచి ఆదరణ చూరగొంటుందని గట్టి నమ్మకం ఉందన్నారు. 25 సెంటర్లలో 40 స్క్రీన్స్ మీద 1000 ఆటలతో సింహా చిత్రాన్ని యుఎస్ లో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. సాగర్, సురేందర్ రెడ్డి, డీవివి దానయ్య, పరుచూరి కిరీటి, చక్రి, జి.నాగేశ్వరరెడ్డి, నమిత, స్నేహ ఉల్లాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|