'బురిడి' ది బెస్ట్ : ఇవివి
కెరీర్ లో దర్శకుడిగా ఏభైయవ మైలురాయి చేరుకున్న ఇవివి సత్యనారాయణ 'బురిడి' చిత్రంతో నవ్వుల విందు చేయబోతున్నారు. దీనికి 'తెగ నవ్వించేత్తాడు' అనేది ఉపశీర్షిక. తాను తీసిన హాస్య చిత్రాలన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారనీ, అందుకు వారికి తానెంతో రుణపడి ఉంటాననీ ఇవివి తెలిపారు. ఆర్యన్ రాజేష్ కథానాయకుడుగా బిగ్ బి ప్రొడక్షన్స్ పతాకంపై ఈదర శ్రీనివాస్, ఈదర రవికుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఇటీవలే బ్యాంకాక్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ హైద్రాబాద్ తిరిగి వచ్చింది. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో సోమవారంనాడు చిత్రయూనిట్ సమావేశమై ఆ విశేషాలను తెలియజేసింది.
ఇవివి మాట్లాడుతూ, 'బురిడీ' చిత్రం కోసం 18 వెర్షన్లు రాశామనీ, రెండు, మూడు వందల సార్లకు పైగా ఈ చిత్రం స్క్రిప్టును తాను చదివి ఉంటాననీ చెప్పారు. దర్శకుడిగా తన 50వ చిత్రం తప్పకుండా కెరీర్ లో ఓ మంచి చిత్రంగా మిగిలిపోతుందన్నారు. ఎడిటర్ గౌతంరాజు సహజంగా ఎడిటింగ్ సమయంలో నవ్వరనే పేరుందనీ, అయితే ఈ చిత్రం ఎడిటింగ్ సమయంలో ప్రతి సన్నివేశంలోనూ ఆయన పడిపడి నవ్వారనీ, దీంతో సినిమాపై తమ నమ్మకం మరింత పెరిగిందనీ అన్నారు. పరిశ్రమలోని హాస్యనటులంతా ఈ చిత్రంలో ఉన్నారనీ, వారంతా కాల్షీట్లు ఎన్నికావాలన్నా ఇచ్చి ఎంతో సహకరించారని అన్నారు. బ్యాంకాక్ లో కొత్త లొకేషన్లను ఎంపిక చేసుకుని చిత్రీకరణ జరిపామన్నారు. జనవరి 1న షూటింగ్ ప్రారంభించి బ్యాంకాక్ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ, ఏప్రిల్ మొదటి వారంలో ఆడియో, అదే నెల 30న సినిమా విడుదల సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. తమది వేరే రంగమైనప్పటికీ సినిమా పట్ల అభిరుచితో ఈ రంగంలోకి వచ్చాయమనీ, ఇవివితో తమ తొలి ప్రయత్నం చాలా సంతృప్తిగా ఉందనీ, సినిమా తామాశించిన విధంగా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉందనీ నిర్మాత ఈదర శ్రీనివాస్ అన్నారు. ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం మాట్లాడుతూ, కామెడీని ఎన్నిరకాలుగా తీయవచ్చో అన్ని రకాల ప్రయోగాలు ఇవివి చేశారనీ, వేసవి తాపంలో రాబోతున్న నవ్వుల వెన్నెల ఈ చిత్రమనీ అన్నారు. ఎల్బీ శ్రీరాం, కొండవలస, శివారెడ్డి, తిరుపతి ప్రకాష్, హేమ, సురేఖావాణి, కల్పన తదితరులంతా ఈ చిత్రంలో నటించడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
|