'ఆవహం'తో భయపెడతా: వర్మ
'ఫూంక్' చిత్రానికి సీక్వెల్ గా తీసిన 'ఫూంక్-2' తెలుగులో 'ఆహవం' పేరుతో ఏప్రిల్ 16న విడుదలవుతుందని ఆ చిత్ర సమర్పకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. సార్థక్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, జడ్ త్రీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ బుర్రా నిర్మాత. మిలింద్ గడాక్కర్ దర్శకుడు. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో వర్మ మాట్లాడారు.
తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. భయం అనేది యూనివర్శల్ ఫీల్ అనీ, ఫూంక్ చిత్రాన్ని చూసినా చూడకపోయినా ఈ చిత్రాన్ని చూడవచ్చనీ అన్నారు. స్టీఫెన్ కింగ్ రాసిన ఓ పుస్తకంలోని పాయింట్ ను తీసుకుని ఈ చిత్రాన్ని మలిచామన్నారు. ఒక దయ్యం కారణంగా ఓ కుటుంబం ఏ విధంగా విచ్ఛిన్నమైందనేది ఇందులో చూపిస్తున్నామని చెప్పారు. సహజంగా దయ్యాన్ని తెల్లచీరలో చూపిస్తుంటారనీ, తాను తీసిన 'రాత్రి' చిత్రంలో ఆరెంజ్ కలర్ చీరలో దెయ్యాన్ని చూపామనీ, ఈ సినిమాలో దయ్యాన్ని జరీ చీరలో చూపించనున్నామనీ తెలిపారు. సినిమా విడుదలకు ముందు థియేటర్ లో ఒక్కరే కూర్చిన చూసిన వారికి బహుమతి అందజేస్తామనీ, పోటీలో పాల్గొన్న వ్యక్తి భయపడిందీ లేనిదీ ఈసీజీ మిషన్ ద్వారా తెలుసుకుంటామనీ చెప్పారు. ఈ చిత్రంలో సుదీప్, అమృత కన్విల్కర్, అహాస్ చన్నా, రిషబ్ జైన్, అను అన్సారి, గణేష్ యాదవ్, జాకీర్ హుస్సేన్, వికాస్ శ్రీ వాత్సవ్, రాకేష్ రాజ్, చ్యాన్ త్రివేది, జీవా తదితరులు నటించారు. చంద్రకాంత్ వసంత్ మెహర్ సినిమాటోగ్రఫీ అందించారు.
Be first to comment on this News / Article!
|