మేథావులు మెచ్చిన 'లీడర్'
ఇంతవరకూ తాను చేసిన వాటిల్లో బెస్ట్ మూవీ 'లీడర్' అనీ, ఏ సినిమాకు దేవుణ్ణి మొక్కుకోలేదు కానీ ఈ చిత్రం హిట్ కావాలని మొక్కుకున్నాననీ ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపారు. సినిమా హిట్ క్రెడిట్ పూర్తిగా ఎవిఎం సంస్థకు దక్కుతుందనీ, తనపై నమ్మకముంచి రానాను తనకు అప్పగించిన సురేష్ బాబుకు తన ధన్యవాదాలని అన్నారు. 'లీడర్ ' చిత్రం సక్సెస్ మీట్ ను హైద్రాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిపారు. పరుచూరి సోదరులు, సురేష్ బాబు, వెంకటేష్ , రమేష్ ప్రసాద్, ఎమ్మెస్ రాజు, అశ్వనీదత్, బెల్లంకొండ సురేష్, చిన్నికృష్ణ, వివి వినాయక్, బి.గోపాల్, కోట శ్రీనివాసరావు, రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్, హర్షవర్దన్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని పార్టీలకు చెందిన అగ్రనాయకులు, మేథావులు 'లీడర్' సినిమా చూసి ప్రశంసించడం మరిచిపోలేనని శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రికి సినిమా చూపిస్తాననీ, సినిమా బాగుందంటూ ప్రకాష్ రాజ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పారనీ, అలాగే మోహన్ బాబు తనకు పుష్పగుచ్ఛం పంపారనీ, లీడర్ వంటి సినిమా తీయడానికి గట్స్ ఉండాలని రామోజీరావు ప్రశంసించారనీ, రాజకీయాలపై తనకున్న అవగాహనను చిరంజీవి ప్రశంసించారనీ తెలిపారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమా స్క్రిప్టు చదవినప్పుడే ఇది లెజెండ్రీ మూవీ అవుతుందని తాను భావించాననీ, ఈ చిత్రం ద్వారా రానాను పరిచయం చేయాలని సురేష్ బాబు సాహసోపైతమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఇమేజ్ చట్రంలో చిక్కకుండా వెంకటేష్ తరహాలోనే రానా సైతం వైవిధ్యమున్న చిత్రాలు చేయాలనుకోవడం అభినందనీయమని అన్నారు. రానాకు మంచి భవిష్యత్ ఉందని రమేష్ ప్రసాద్ పేర్కొన్నారు. శేఖర్ కమ్ముల అంటే తనకు ఇష్టమని వినాయక్ అన్నారు. కొత్తతరానికి ఆయన బాపు లాంటివాడని ప్రశంసించారు. రక్తపాతం లేకుండా రాజకీయ నేపథ్యమున్న సినిమా తీయడం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. రానాను రామానాయుడుగా పిలవడానికి తాను ఇష్టపడతాననీ, అలాగే తన మిత్రుడు సుబ్బరాజుకు ఇందులో మంచి పాత్ర దొరకడం సంతోషంగా ఉందనీ అన్నారు.
Be first to comment on this News / Article!
Pages: 1 -2-
|