రామునికి 'వరుడు' పట్టువస్త్రాలు
శ్రీరామనవమి సందర్భంగా హైద్రాబాద్ ఫిల్మ్ నగర్ రామాయంలోని సీతారాములకు యువ హీరో అల్లు అర్జున్ పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణం జరిపించారు. ఈనెల 31న 'వరుడు' చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. చిత్ర దర్శకుడు గుణశేఖర్, నిర్మాత డివివి దానయ్య ఈ వేడుకలో పాల్గొన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ, సీతారామకల్యాణం జరిగే శ్రీరామనమమి ఎంతో సుదినమనీ, సీతారాముల సన్నిధిలో 'వరుడు' విడుదల తేదీని ప్రకటిస్తున్నామని అన్నారు. సీతారామ కల్యాణం ఎంత వైభవంగా జరుగుతుందో అందరికీ తెలుసనీ, మా వరుడు చిత్రం కథలో కూడా పెళ్లికి చాలా ప్రాధాన్యం ఉంటుందనీ, 5 రోజుల పెళ్లిని అద్భుతంగా గుణశేఖర్ తెరకెక్కించారనీ అన్నారు. గుణశేఖర్ తో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలనిపిస్తోందనీ, దానయ్య గారు కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చాలా లావిష్ గా తెరకెక్కించారనీ, సమ్మర్ స్పెషల్ గా వస్తున్న 'వరుడు' చిత్రం అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. గుణశేఖర్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో వేటూరి గారు పెళ్లిపాట రాస్తూ అందులో 'వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి' అన్నారనీ, ఇందులో బన్నీ చేస్తున్న క్యారెక్టర్ పేరు సందీప్ అనీ చెప్పారు. అతనే వరుడనీ, తన పెళ్లి రాముడి పెళ్లంత ఘనంగా జరగాలని కోరుకుంటాడనీ, రాములవారి పెళ్లిలా ఈ పెళ్లిని కూడా అంతే వైభవంగా చూపించామనీ అన్నారు. అలాగని బన్నీ రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉండడనీ, బన్నీ స్టైల్ లోనే ఉంటాడనీ నవ్వుతూ చెప్పారు. రామాలయంలో 'వరుడు' విడుదల తేదీని ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. వధువు ఎవరంటూ అంతా ఆసక్తిగా ఉడుగుతున్నారనీ, మార్చి 31న ఈ సస్పెన్స్ విడిపోతుందనీ చెప్పారు. కథ ప్రకారం హీరోయిన్ ని ముందుగా రివీల్ చేయకపోవడమే చాలా కరెక్ట్ అని అన్నారు. అల్లు అర్జున్ నటన హైలైట్ అయితే, మణిశర్మ మ్యూజిక్ సూపర్బ్ అనీ, ఓ మంచి చిత్రాన్ని చూసామన్న తృప్తి తప్పకుండా ప్రేక్షకులకు కలుగుతుందనీ చెప్పారు. 300కు పైగా ప్రింటతో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నట్టు దానయ్య తెలిపారు. బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా తమ బ్యానర్ కు మంచిపేరు తెచ్చిపెడుతుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో తమిళ హీరో ఆర్య, సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, సింగీతం శ్రీనివాస్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు నటించారు. వేటూరి పాటలు, ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, తోట ప్రసాద్ మాటలు, స్టన్ శివ పైట్స్, ఆంధోని ఎడిటింగ్ అందించారు.
Be first to comment on this News / Article!
|