చిరు క్లాప్ తో 'బద్రీనాథ్' షురూ
అల్లు అర్జున్, తమన్నా జంటగా గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 30గా 'బద్రీనాథ్' చిత్రం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనుంది. ఠాగూర్ మధు నిర్మాణ సారథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సంచనల దర్శకుడు వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, చాలాకాలం తర్వాత రచయిత చిన్నికృష్ణ ఈ చిత్రానికి పవర్ ఫుల్ కథ అందిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైద్రాబాద్ లోని ఫిల్మ్ నగర్ టెంపుల్ లో గురువారంనాడు జరిగాయి. ఈ చిత్రానికి చెందిన టెక్నీషియన్లు, సన్నిహితలు ఇందులో పాల్గొన్నారు. అల్లు అర్జున్ పై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇవ్వగా, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కెమెరా స్విచ్చాన్ చేశారు. చిన్నకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు.
'గజనీ', 'మగధీర' వంటి సెన్సేషన్ హిట్ల తర్వాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్ ను తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాలనే ఆలోచనలో అరవింద్ ఉన్నారు. ఈ చిత్రానికి ఆనంద్ సాయి ఆర్ట్, ఎస్.రవివర్మన్ ఛాయాగ్రహణం, పీటర్ హెయిన్స్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్నారు.

Be first to comment on this News / Article!
|