రవితేజ 'మిరపకాయ్' ప్రారంభం
రవితేజ కథానాయకుడుగా ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్ పుప్పాల నిర్మిస్తున్న కొత్త చిత్రం 'మిరపకాయ్'. హరీష్ శంకర్ ('షాక్' ఫేమ్) దర్శకుడు. రవితేజ సరసన రిచా గంగోపాథ్యాయ్ ('లీడర్' ఫేమ్), దీక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ బెల్లంకొండ సురేష్ కార్యాలయంలో శుక్రవారంనాడు ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి విక్టరీ వెంకటేష్ క్లాప్ ఇవ్వగా, ప్రభాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
రమేష్ పుప్పాల మాట్లాడుతూ, రవితేజతో సినిమాలు తీయడం కోసమే ఈ బ్యానర్ ను తాను ప్రారంభించారనీ, హరీష్ శంకర్ చెప్పిన స్టోరీ తనకు బాగా నచ్చి నిర్మాణం చేపట్టాననీ తెలిపారు. మే 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందనీ, సినిమాలోని కొంత భాగం ఇజ్రేల్, ప్యారిస్ లలో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నామనీ చెప్పారు. ఈ ఏడాది దీపావళి కానుకగా సినిమా రిలీజ్ ఉంటుందని చెప్పారు. రవితేజ మాట్లాడుతూ, ఇది పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ అనీ, షాక్ చిత్రం తర్వాత మళ్లీ హరీష్ తన చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారనీ తెలిపారు. సంగత దర్శకుడు థమన్ తో ఇది తన మూడో చిత్రమనీ, అలాగే ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అంటే తనకెంతో ఇష్టమనీ చెప్పారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ, తన గత చిత్రం ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా కథను నమ్మి రవితేజ ఈ చిత్రానికి అంగీకరించారనీ, అలాగే నిర్మాతలు తాను ఏది కోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ చిత్రాన్ని పూర్తి ఎంటర్ టైనర్ గా రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ చిత్రానికి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, యస్.థమన్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|