9న '1940లో ఒక గ్రామం'
బాలాదిత్య, శ్రీరమ్య హీరోహీరోయిన్లుగా ముక్కురాజు ఓ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం '1940లో ఒక గ్రామం'. ఈ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నరసింహ నంది రూపొందించారు. ఈ చిత్రం ఇటీవలే జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డును అందుకుంది. గురుజాడ, చలం రచనలను స్ఫూర్తిగా తీసుకుని నరసింహ నంది ఈ చిత్రాన్ని రూపొందించారు. జాతీయ అవార్డు అందుకున్న ఈ చిత్రం ఇంతవరకూ ప్రేక్షకులకు ముందుకు రానప్పటికీ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ముందుకు వచ్చి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు పూనుకున్నారు. బెల్లంకొండ సురేష్ సమర్పణలో ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సంస్థ కార్యాలయంలో శుక్రవారంనాడు ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు.
ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే సదాశయంతో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు వచ్చినట్టు తెలిపారు. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ చేయనున్నామనీ, ప్రేక్షకుల చక్కటి ఆదరణ చూపుతారనే నమ్మకంతో ఉన్నామనీ బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావడం, ఇప్పుడు బెల్లంకొండ ముందుకు వచ్చి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తుండటం సంతోషంగా ఉందని నరసింహ నంది, బాలాదిత్య, శ్రీరమ్య సంతోషం వ్యక్తం చేశారు.
Be first to comment on this News / Article!
|