చరణ్ బర్త్ డేలో చిరు, అల్లు
'మగధీర'తో తెలుగు సినిమా కలెక్షన్ల రికార్డులను తిరగరాసిన యువహీరో రామ్ చరణ్ తేజ తన పుట్టినరోజు వేడుకను శనివారంనాడు ఆస్ట్రేలియాలో జరుపుకొంటున్నారు. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు రామచరణ్ తండ్రి, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, ఆయన సతీమణి ఆస్టేలియా బయలుదేరి వెళ్లారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో నాగబాబు నిర్మిస్తున్న 'ఆరంజ్' చిత్రం షూటింగ్ కోసం నెలరోజులుగా రామ్ చరణ్ ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. చిరంజీవి దంపతులు మూడు రోజుల పాటు తన కుమారుడి వద్దే ఉండి హైదరాబాద్ కు తిరిగి వస్తారు. 'ఆరంజ్' షూటింగ్ స్పాట్ లోనే చరణ్ పుట్టినరోజు వేడుక జరుపుకొంటున్నారు.
హైదరాబాద్ లో శనివారంనాడు జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ పాల్గొని కేక్ కట్ చేసి మీడియా ద్వారా రామ్ చరణ్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో పెద్దఎత్తున మెగాభిమానులు పాల్గొన్నారు. సుమారు 700 మంది అభిమానులు రక్తదానం చేశారు. క్రమశిక్షణ కలిగిన మెగాభిమానులు సేవాభావంతో మరింత ముందుకు వెళ్లాలని అల్లు అరవింద్ ఈ సందర్భంగా కోరారు. ఈ ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు తాను వెళ్లలేకపోయినప్పటికీ ఇక్కడి నుంచే తన శుభాకాంక్షలు తెలుపుతున్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
Be first to comment on this News / Article!
|