'1977' ఆడియో రిలీజ్
శరత్ బాబు, జయసుధ, నమిత, ఫర్జానా ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన ఓ చిత్రం తెలుగులోకి '1977' పేరుతో అనువాదమైంది. బి.ఎన్.దినేష్ కుమార్ దర్శకత్వంలో ఆర్.శరత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారం జరిగింది. జయసుధ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని తమ్మారెడ్డి భరద్వాజకు అందించారు. బి.ఎన్.దినేష్ కుమార్, రాజ్, శ్రీధర్ రెడ్డి, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
జయసుధ మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రాకముందు తాను నటించిన చివరి చిత్రమిదనీ, శరత్ కుమార్ కు భార్యగా ఇందులో నటించాననీ అన్నారు. ఈ చిత్రం తెలుగులో కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ఈ చిత్ర దర్శకుడు యాడ్ ఫిల్మ్ చేస్తూ సినిమా రంగంలోకి వచ్చారనీ, అలాగే విద్యాసాగర్ తాను చేసిన 16 సినిమాలకు పనిచేశారనీ అన్నారు. ఈ చిత్రం విజువల్స్ తో పాటు ఆడియో కూడా బాగుందనీ, సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. తమిళంలో రూపొందిన ఈ చిత్రంలో మన జయసుధ నటించారనీ, అందువల్ల ఇక్కడ కూడా బాగా ఆడుతుందని అనుకుంటున్నాననీ ప్రభు తెలిపారు. దినేష్ కుమార్ మాట్లాడుతూ, తనకు తెలుగంటే ఎంతో ఇష్టమనీ, ఈ చిత్రం కోసం 30 రోజుల పాటు హైదరాబాద్ లో తెలుగు టెక్నీషన్స్ తో పనిచేశాననీ చెప్పారు. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నట్టు తెలిపారు.
Be first to comment on this News / Article!
|