సావిత్రి పేరిట దాసరి అవార్డు
దర్శకరత్న దాసరి నారాయణరావు 65వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. నాలుగున్నర దశాబ్దాల నటజీవితం పూర్తి చేసుకున్న దాసరి జన్మదినోత్సవం సందర్భంగా మే 4న 'డైరెక్టర్స్ డే'ను ఏటా తెలుగు పరిశ్రమ ఘనంగా జరుపుకొంటోంది. దాసరి జన్మదినోత్సవం నాడు పరిశ్రమలోని వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా దాసరి జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. మహానటి సావిత్రి పేరిట దాసరినారాయణరావు నెలకొల్పిన 'మహానటి సావిత్రి జాతీయ అవార్డును' ఈసారి ప్రదానం చేయనుండటం విశేషం. ఈ అవార్డు కింద 2 లక్షల నగదు, జ్ఞాపిక బహుకరించనున్నారు.
2009 సంవత్సరానికి గాను ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నూతన దర్శకుడు, ఉత్తమ ఫిలిం జర్నలిస్ట్, ఉత్తమ ఫోటో ఫిలిం జర్నలిస్టులను ఎంపిక చేసి నగదు బహుమతి, అవార్డులతో సత్కరించనున్నారు. పదిమంది పేద విద్యార్థులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి పది వేల రూపాయలు దాసరి అందించడం జరుగుతుంది. ఈ అవార్డుల ఎంపిక కోసం డాక్టర్ మోహన్ బాబు సలహాదారుగా, ఇండో భారత్ పవర్ ఇన్ ఫ్రా లిమిటెడ్ చైర్మన్ కె.రఘు అధ్యక్షుడుగా, కె.సి.శేఖఱ్ బాబు, జి.జగదీష్ చంద్రప్రసాద్, పరుచూరి విజయలక్ష్మి, సుబ్బారావు సభ్యులుగా కమిటీ ఏర్పాటైంది. అలాగే మే 3న రవీంద్రభారతిలో పలువురు రంగస్థల ప్రతిభావంతులకు 'దాసరి రంగస్థల ప్రతిభా పురస్కారాలు' అందజేయనున్నారు. దాసరి జన్మదిన వేడుకల కమిటీకి తమ్మారెడ్డి భరద్వాజ చైర్మన్ గా, రేలంగి నరసింహారావు వైస్ చైర్మన్ గా, వంశీ రామరాజు కన్వీనర్ గా, కె.ధర్మారావు కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|