(డా.విజయబక్ష్)
ఎందువల్లోనో తెలీదు కాని చాలా మంది స్త్రీలు ఏదో కోల్పోయినట్లు, నిరాశగ, నిస్పృహగ తరచు మాట్లాడుతుంటారు. 'నిద్ర లేచింది మొదలుకొని వండుకోవడం, తింటం, గిన్నెలు కడుక్కోవటం, బట్టలుతుక్కోవటం, పిల్లల్ని సముదాయించటం. ఇంతేగా జీవితమంటే ఏముంది' అంటారు. మరికొంత మంది తమకు లేనిది ఎదుటివారికి ఉంది కాబట్టి వారెక్కువ సంతోషంతో ఉన్నారని అనుకొంటారు. మీకేం హాయిగా ఉద్యోగం చేస్తున్నారు. బోలెడంత కాలక్షేపం.. మాకు ఇంట్లోనే పడుండటం ఎంత బోర్ గా ఉంటుందో అంటారు.
కొంచెం ఆలోచించి చూస్తే ఇవన్నీ సత్యదూరాలే! ఎవరి పనిలో వారు ఆనందాన్ని పొందలేక మనకు తెలీని దాన్ని, దొరకని దాన్ని గురించి ఊహించుకుంటుంటారు. ఉద్యోగస్థులకు, గృహిణులకు కూడా సాధక బాధకాలున్నాయి. అంతమాత్రాన అసంతృప్తితో నిరంతరం నలిగిపోతు, రగిలిపోతు ఉంటే ఉంటే పొందవలసిన ఆనందానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. ఉన్నంతలో అవకాశం ఉన్నంత వరకయినా కొన్ని విషయాల్లో మనం చేయగలం అనే పనులు కూడా చేయకుండా తప్పించుకొంటూ మాకేం పనిపాట లేదని అనుకోవడం కూడా పెద్ద నేరమే!
కాస్తో కూస్తో చదువుకున్నవారు కూడా దినపత్రికలవైపు కన్నెత్తి చూడరు. భర్త, పిల్లలు, బయటకు, స్కూలకి వెళ్ళాక తీరిక సమయంలో హాయిగా ఏదో ఒక పుస్తకం చదవవచ్చు. పత్రిక తిరగెయ్యవచ్చు. ఇంకా కొంచెం ఆలోచించగల తల్లులయితే పిల్లల కోసం ఓ మంచి సూక్తి వాక్యాన్ని అది తెలుగులో కానీయండి, ఆంగ్లంలో కానీయండి రోజుకొక్కటి చొప్పున సిద్ధం చేసుకొని పిల్లలకి ఏ భోజనం తినిపించేటపుడో చెప్పవచ్చు. భాష పట్ల మక్కువ ఉన్నవారయితే కొత్త పదాలను కనీసం రోజుకి రెండయినా నేర్పవచ్చు. ప్రత్యేకంగా పిల్లల్ని ట్యూషన్లకు పంపటం, వారిని దిగబెట్టడం, తీసుకురావటం, ఈ శ్రమ పడేకంటే టెన్త్, ఇంటర్ వరకు చదువుకొన్న అమ్మలు తమ పిల్లలకి ఐదవ తరగతి వరకు తామే చదువు చెప్పవచ్చు. అదేమంటే 'ఇంట్లో పిల్లకి భయముండదంటారు కొందరు, మరి కొందరయితే పిల్లలు చేసే అల్లరి భరించలేకనే బయటకి పంపుతామంటుంటారు'
|