పది నిమిషాలైనా ఆమె నోరు విప్పకపోయేసరికి మన్మధరావులో అసహనం కట్టలు తెంచుకోసాగింది. ఇక లాభం లేదన్నట్లు ఆమె చేతులను తన తలపై వేసుకొని పాత సినిమాలో గుమ్మడిలా దీనంగా ఫోజు పెట్టి 'నిజం చెప్పకపోతే నామీదొట్టే' అన్నాడు.
ఇక ఓవర్ యాక్టింగ్ చేస్తే మంచిది కాదని, మొదటికే మోసం రావచ్చునని అర్ధం చేసుకొని ప్రియంవద నోరు విప్పింది. నేల చూపులు చూస్తూ 'మీరన్నది నిజమే. మొదటి ఇద్దరికీ, వాడికీ తండ్రులు వేర్వేరు. అందుకే వారి ప్రవర్తనలలో తేడా ఉంది' అని నెమ్మదిగా ఒక్కొక్క పదం వత్తి పలుకుతూ చెప్పింది.
ఆమె చెప్పిన సమాధానం ఆశించిన విధంగానే ఉండడంతో మన్మధరావు పెద్దగా షాక్ కు గురవలేదు. బహుశా మరొకరైతే తెలుగు సినిమాలలో చూపించినట్లు ఎంత ద్రోహం చేశావు ప్రియంవదా... నేను నీకు ఏమి అన్యాయం చేశానని నాకు ఈ పరీక్ష అంటూ ఆవేశంగా పెద్ద పెద్ద డైలాగులు పలకడం, ఆమె చెంపను చెళ్ళుమనిపించడం చెయ్యలేదు. స్వతహాగా నెమ్మదస్తుడైన మన్మధరావు ఒక గాఢమైన నిట్టూర్పు విడిచి' థ్యాంక్స్ ప్రియా... ఈ పూట నా మాట మన్నించి నిజం చెప్పినందుకు నీకు నేను ఎంతో ఋణపడి ఉన్నాను.
సరే! అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. నారు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా పంట చేతికి వచ్చాక ఏడిస్తే ఏం లాభం? గతంగత: అనుకుంటూ యధావిధిగా మన జీవితం కంటిన్యూ చేద్దాం. కానీ ఒక చిన్న రిక్వెస్టు. చంటాడికి తండ్రి ఎవరో కాస్త చెప్పు' అన్నాడు.
ఆ మాటలకు మళ్ళీ ప్రియంవద పోయి నేలచూపులు చూడసాగింది. భర్తకు ఈ విషయం చెప్పాలా వద్దా అని మధన పడసాగింది.
మన్మధరావు ఆమెను వదిలిపెట్టలేదు. మళ్ళీ మళ్ళీ అడగడమే కాకుండా చెప్పకపోతే ఒట్టు అంటూ మళ్ళీ చేతులు తలపై పెట్టుకున్నాడు.
ప్రియంవద ఇక ఊరుకోలేక 'మన చంటాడికి తండ్రి మీరే' అని గబ గబ అక్కడి నుండి వెళ్ళిపోయింది.
మొదట ఆమె మాటలు మన మన్మధరావుకు అర్థం కాలేదు. పది నిమిషాల తరువాత అతని బుర్రలో లైటు వెలిగి అసలు విషయం అర్ధం అయ్యేసరికి బుర్రలో పెద్ద విస్ఫోటనం జరిగి కళ్ళు తిరిగి కింద ఢామ్మని పడిపోయాడు - చంటాడికి మాత్రమే తండ్రి అయిన మన్మధరావు.
|