మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ గా బిరుదు పొందిన శోభనరావుకు ముప్పై ఏళ్ళు దాటినా పెళ్ళి అవలేదు. అందుకు కారణం పెళ్ళంటూ చేసుకుంటే కోకిల స్వరం వుండి లతా మంగేష్కర్, సుశీల, జానకి ల వలే శ్రావ్యం గా పాటలు పాడగల అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని పంతం పట్టాడు.
బి.కాం చదివి ఆంధ్రా బ్యాంక్ లో క్యాషియర్ గా ఇరవై అయిదేళ్ళకే ఉద్యోగం సంపాదించుకున్న శోభనరావుది ఒక మోస్తరు అందం. చామన చాయ, అయిదడుగులు మించని ఎత్తు, పీల కంఠ స్వరం, ఎకర్సైజులు ఎరుగని కారణం గా పొడుచుకు వచ్చిన బొజ్జ , ఎత్తయిన క్రాఫ్ తో ఎనభై దశకం లో యావత్ ఆంధ్ర మహిళామణులను ఉర్రూతలూగించిన శోభన్ బాబు లా వుంటానని భ్రమపడే శోభనరావుకు తాను కామెడీ ఆర్టిస్టు పెర్సనాలిటీ తో వుంటానన్న సంగతి తెలియకపోవడం వలన నిత్యం ఊహల ప్రపంచం లో విహరించేవాడు.
శ్రీదేవి, జయప్రద, సౌందర్య లాంటి పెర్సనాలిటీ వున్న అమ్మాయికి అద్భుతం గా పాడగల కెపాసిటీ ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ కావాలని భీష్మించుకు కూర్చున్నాడు. చూడడానికి జోకర్ లా వున్నా, చేస్తున్న ఉద్యోగం, వెనుక వున్న ఆస్తి పాస్థులను చూసి చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు పిల్లనిస్తామని ముందుకు వచ్చారు . టుబి వెరీ ఫ్రాంక్ వారిలో కొన్ని మంచి సంబంధాలు కూడా వచ్చాయి గాని పాడగల అడిషనల్ క్వాలిఫికేషను లేకపోవడం వలన అన్నింటినీ తిరగగొట్టేసాడు మన శోభనరావు. వచ్చిన ప్రతీ సంబంధాన్ని ఆ సాకుతో తిరగగొట్టేస్తుండడంతో శోభనరావు తల్లిదండ్రులు కూడా విసిగిపోయారు. రాన్రాను మంచి సంబంధాలు కూడా రావడం తగ్గిపోయాయి. పెళ్ళిళ్ల పేరయ్యలందరూ ఆ ఇంటి చాయలవైపు రావడం మానేసారు. కొడుకు పెళ్ళిచేసుకొని ఏడాది తిరగక ముందే తమ ఒళ్ళో మనవడిని పెడితే ఎత్తుకుంటూ ఆనందిద్దామన్న శోభనరావు తల్లిదండ్రుల ఆశలు అడియాసలే అయ్యాయి. =
|