'అమరావతి' రివ్యూ
క్రియేటివ్ డైరెక్టర్ అనే పదం తరచు వినిపిస్తుంటుంది. నిజానికి కొత్త ప్రక్రియ గురించి చెప్పినప్పుడో, అడ్వాన్స్ థాట్స్ తో సినిమాలు తీయగలిగినప్పుడో ఆ పదాన్ని వర్తింపజేయాలి. ఇలాంటి అడ్వాన్స్ థాట్స్ తో సినిమాలు తీసినప్పుడు ఆ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందిన సందర్భాలు కూడా ఎక్కువే. దర్శకుడు అల్లరి రవిబాబు ఆ దిశగా ఇప్పటికే కొన్ని అడుగులు వేశారు. ప్రేణాధికంగా ప్రేమించిన అమ్మాయి చనిపోతే ఆమె అంతకుముందే 'డొనేట్' చేసిన శరీర భాగాలు ఆ తర్వాత ఎవరెవరికి అమర్చారో వారందర్నీ చంపి వాటిని కలెక్ట్ చేసే ఓ సైకో లవర్ కథాంశంతో తీసిన 'అనసూయ' ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ కావడం ఇందుకు ఓ కారణం. రవిబాబు ఇప్పుడు కూడా ఈ తరహా లైన్స్ లోనే ఇంతవరకూ తెలుగులో ఎవరూ టచ్ చేయని థ్రిల్లర్ జనర్ సబ్జెక్ట్ తో 'అమరావతి' చిత్రాన్ని తెరకెక్కించారు. గర్భాశయం అద్దెకు ఇచ్చే తల్లులు (సర్రొగేట్ ఉమన్) గురించి అందరికీ అంత పరిజ్ఞానం ఉండకపోవచ్చు. హిప్నోసిస్...గురించి కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్లలో కూడా ఏవో అనుమానాలు సహజం. ఈ రెండు అంశాలను కీలకంగా తీసుకుని కథను అల్లుకోవడంలోనే రవిబాబు చతురత కనిపిస్తుంది. ఏదో కొత్త సబ్జెక్ట్ డీల్ చేశాడనే క్యూరియాసిటీని ప్రేక్షకులలో కలిగిస్తుంది. అయితే షరామామూలుగా రవిబాబు మార్క్ 'రక్తపాతాల'కూ సినిమాలో కొదవలేదు. ముందు జాగ్రత్తగా సెన్సార్ 'ఎ' సర్టిఫికెట్ ఇవ్వడంతో 'గర్భణీ స్త్రీలు, హార్ట్ ట్రబుల్ ఉన్న వాళ్లు ఈ సినిమా చూడొద్దు' అనే టైటిల్ కార్డు, పాత్రలన్నీ కల్పితాలేనంటూ మరో కార్డు వేసి కథాగ్రమంలోకి వెళ్లారు. ఆ ముచ్చట్లలోకి వెళితే...
తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీలపై దాడులతో నగరం అట్టుడికి పోతుంటుంది. ఈ దాడులన్నీ ఒకేలా, ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జరిగిపోతుంటాయి. ఈ అన్ని సందర్భాల్లోనూ నిండు గర్భిణీల కడుపు కోసేసి శిశువులను ఎత్తుకుపోతుంటారు. దాడులకు ముందే 108కు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి...'9 నెలల గర్భిణికి సీరియస్ గా ఉంది. అంబులెన్స్ కావాలి' అని చెబుతుంటాడు. వైద్య సిబ్బంది అక్కడకు చేరుకునే లోపే గర్భస్త శిశివులు మాయవవుతుంటాయి. వరుస కేసులు వెలికి చూస్తుండటంతో పోలీస్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగుతోంది. వెంకట్ (రవిబాబు) టీమ్ లీడర్ గా ఈ కేసును టేకప్ చేస్తాడు. ఈ క్రమంలోనే ఓ గర్భిణీపై దాడి జరిగినప్పుడు అక్కడకు చేరుకున్న వెంకట్ కు ఓ ఉన్మాది (తారకరత్న) పట్టుబడతాడు. ఇంటరాగేషన్ లో గానీ, నార్కోటెస్ట్ లో కానీ అతని నుంచి ఏ సమాచారం రాబట్టలేకపోతారు. అతను కస్టడీలో ఉన్నప్పటికీ గర్భిణీలపై దాడులు, వారి కడుపు కోసి శిశువులు మాయం చేయడం వంటివి జరిగిపోతుంటాయి. కస్టడీలో నిందితుడు ఉండగా బయట ఈ ఘాతుకాలకు ఎవరు పాల్పడుతున్నారనేది మిస్టరీగా ఉంటుంది. ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నదెవరు? పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడి నిజ స్వరూపం ఏమిటి? ఈ మిస్టరీని వెంకట్ ఏ విధంగా ఛేదించాడు అనేది మిగతా కథ.
Be first to comment on this News / Article!
Pages: 1 -2- -3-
|