కెఆర్వీకి ఎస్వీఆర్ అవార్డు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నభూతో నభవిష్యతి అన్న తరహాలో ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన స్వర్గీయ ఎస్.వి.రంగారావు పేరిట ఏర్పాటు చేసిన ఎస్వీఆర్ స్మారక కంకణాన్ని సీనియర్ నటి కె.ఆర్.విజయ స్వీకరించనున్నారు. అమ్మవారి పాత్రలకు తనకు తానే సాటి అనిపించుకుని, నటిగా 400కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు, తమిళ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసిన నటి కె.ఆర్.విజయ. ఎస్వీ ఆర్ ఇంటర్నేషనల్ అకాడమీ (యుఎస్ఎ)తో కలిసి ప్రముఖ సాంస్కృతిక సంస్థ 'ఆరాధన' ఈనెల 3న రవీంద్రభారతిలో ఈ స్వర్ణకంకణ ప్రదానోత్సవాన్ని నిర్వహించనుంది. అమెరికాలోని ప్రవాస భారతీయలు ఈ కార్యక్రమ నిర్వహణకు ఆర్థిక సౌజన్యాన్ని అందిస్తున్నట్టు 'ఆరాధన' అద్యక్షుడు గుదిబండ వెంకటరెడ్డి, ఎస్వీ రంగారావు ఇంటర్నేషనల్ అకాడమీ చైర్మన్ చందు శ్రీనివాస్ తెలిపారు.
స్వర్ణకంకణ ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి కె.రోశయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. దర్శకరత్న డాక్టర్ దాసరినారాయణరావు చేతులమీదుగా అవార్డు ప్రదానం జరుగుతుంది. సభాధ్యక్షులుగా 'ఆంధ్రప్రభ' సంపాదకులు పి.విజయబాబు, గౌరవ అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ ధర్యాదాయ శాఖ), విశిష్ట అతిథిగా ఇండియన్ మీడియా సెంటర్ (న్యూఢిల్లీ) చైర్మన్ శ్యాం ఖోస్లా పాల్గొంటారు. పద్మశ్రీ శోభానాయుడు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. వర్దమాన రచయిత్రి శ్రుతకీర్తి వ్యాఖ్యాతగా వ్యవహిస్తారు. ఎస్వీఆర్ స్మారక కంకణాలను యు.వి.కృష్ణంరాజు 2007లోనూ, కైకాల సత్యనారాయణ 2008లోనూ అందుకున్నారు.
Be first to comment on this News / Article!
|