డబ్బింగ్ సినిమాల వరద
ఒక భాషలో సక్సెస్ అయిన సినిమాలు మిగతా భాషల్లో అనువాద రూపంలో ప్రేక్షకుల ముందుకు రావడం పరిపాటి. ఒక్కోసారి ఇతర భాషల్లో ఫెయిల్ అయిన సినిమాలు కూడా అందులోని హీరోహీరోయిన్లకు ఉన్న గుర్తింపును బట్టి అనువాద రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఆమధ్య కాలంలో తమిళ డబ్బింగ్ సినిమాల సందడి బాగా ఎక్కువగా కనిపించేంది. గత ఏడాది అనువాద చిత్రాలేవీ తెలుగులో నిలబడకపోడంతో ఆ వేగం తగ్గింది. ఇప్పుడు మరోసారి డబ్బింగ్ సినిమాల సందడి ఊపందుకుంటోంది.
'అపరిచితుడు' తర్వాత విక్రమ్, 'గజనీ' తర్వాత సూర్య నటించిన చిత్రాలు ఏమాత్రం మిస్ కాకుండా తెలుగులోనూ అనువాదమవుతున్నాయి. ఈమధ్యనే సూర్య నటించిన తమిళ 'వరణం ఆయిరం' చిత్రం 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' పేరుతోనూ, 'అయన్' చిత్రం'వీడొక్కడే' పేరుతోనూ తెలుగులో అనువాదమై విడుదలయ్యాయి. ఇప్పుడు సూర్య-నయనతార జంటగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆదవన్' చిత్రాన్ని కూడా తెలుగులోకి అనువదించనున్నారు. విక్రమ్ నటించిన 'కందసామి' తెలుగులో 'మల్లన్న' పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. కమల్ హాసన్ తమిళ, తెలుగు భాషల్లో నటిస్తూ నిర్మిస్తున్న 'ఈనాడు' ఆగస్టు కానుకగా రానుంది. తమిళ హీరో అజిత్ నటించిన 'ఏగన్' చిత్రం తెలుగులో 'మల్లిక ఐ లవ్ యు' పేరుతో అనువాదమై త్వరలోనే విడుదల కానుంది. దర్శకుడు-నటుడు ఎస్.జె.సూర్య, తమన్నా, నమిత ప్రధాన పాత్రల్లో తమిళం విడుదలైన 'వ్యాబారి' చిత్రం తెలుగులో 'వ్యాపారి'గా అనువాదమై ఈనెల రెండో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. శరత్ కుమార్ కథానాయకుడుగా తమిళంలో నటించిన ఓ చిత్రం 'విక్రమ్ రాథోడ్'గా అనువాదమై ఈనెలలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడ నటుడు దేవరాజ్ తనయుడైన ప్రజల్వ్ దేవరాజ్ హీరోగా నటించిన ఓ కన్నడ చిత్రం 'గ్యాంగ్ లీడర్' పేరుతో అనువాదమై ఈనెల 10న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా డజనుకు పైగా అనువాద చిత్రాలు టాలీవుడ్ మార్కెట్ ను ఆకట్టుకుంటునేందుకు క్యూ కట్టేశాయి.
Be first to comment on this News / Article!
|