|
|
Articles: My Thoughts | మనిషి-భాష-పని - Site Administrator
| |
(డా.జె.రాజారాం)
చేతినిండా పని వుంటే అంతే నిండుగా మనిషి జీవితంలో భాష ఉంటుంది. పని కొనసాగుతున్నంత సేపు భాష మాటగా, పాటగా కొనసాగుతుంటుంది. పని ఆగిపోతే భాష (మాట) ఆగిపోతుంది. పాటా ఆగిపోతుంది. అవసరం, జ్ఞానం, పని, పనిముట్లు, పనిముట్లతో చేతులు చేసే పనులు, నడిచే కాళ్ళు ఇలా మనిషి జీవితం నిరంతరం ప్రవాహంలా సాగిపోతూవుంటుంది. ఈ భాష అంతర్భాగమై ప్రవహిస్తుంది. జీవితం ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు భాష కుడా అకస్మాత్తుగా ఆగిపోతుంది.
అట్లా ప్రమాదానికి గురై మాట (భాష)కు దూరమైన వ్యక్తి జనగామ (వరంగల్లు)లో ఉన్నాడు. ఆ వ్యక్తి మోకాళ్ళ వరకు రెండు కాళ్ళూ లేవు. మోచేతి నుండి కుడి చేయి లేదు. టైరు రబ్బరును నడుము కింద వేసుకుని తాడుతో నడుముకు కట్టుకున్నాడు. జిడ్డుబారిన జుట్టు, గడ్డం, మీసాలతో దుమ్ముబారి వుంటాడు. ఒక చోటునుండి మరో చోటుకు కదలాలంటే కమండలం లాంటి కర్రను ఎడమ చంకలో పెట్టుకుని ఎడమ చేతి బలంతో లాక్కుంటూ వెళతాడు. లాగినప్పుడల్లా రెండంగుళాలు కదులుతాడేమో!
అతని పేరు రాములు. జనగామ గుండ్లగడ్డ నివాసి. 50 సంవత్సరాలు ఉంటాయి. కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాక జనగామ మున్సిపాలిటి ఆవరణ అతనికి ఆశ్రయం ఇస్తోంది. ఇతనిని కలిసి కాళ్ళు చేతులు ఎలా పోగొట్టుకున్నావని అడిగాను. అడిగానో లేదో కన్నీళ్ళ పర్యంతమయ్యాడు. కన్నీళ్ళు తుడుచుకుంటూ తన గతాన్ని ఇలా వివరించాడు. అతని గతాన్ని అతని మాటల్లోనే చూద్దాం.
'నా పేరు రాములు. నా తల్లితండ్రులెవరో నాకు తెలవదు. నా ఊరేదో కూడా తెలవదు. నేను బంజార అతన్ని. జనగామకు ఎట్ల వచ్చినానో తెలవదు. గాలికి వచ్చినట్టే వచ్చిన. కూలి నాలి చేసుకుంటు బతికిన. తరువాత జనగామలోని భవాని మెస్ లో ఎనిమిది సంవత్సరాలు, భయ్యా హోటల్ల చాలా సంవత్సరాలు పని చేసిన. హోటల్ పనిమనిషినైనా మంచి బట్టలు వేసుకునేవాన్ని. కరక్టుగా పనిచేసేవాన్ని. ఎవరి చేతా మాట పడేవాన్ని కాదు. దర్జాగా ఉంటానని హోటల్ యజమానులకు కళ్ళు మంట. ఇంత మంచి బట్టలు వేసుకుంటావేందిరా అనేవాళ్ళు. పని మనిషులు మంచి బట్టలు వేసుకోవద్దా అనేవాన్ని. ఆ మాట వారికి నచ్చేది కాదు. ఈ కాళ్ళ మీద నడిచే నేను ఈ చేతులతో చాకిరి చేశాను' అంటూ తన కాళ్లు చేతుల వైపు చూపించాడు.
'నేను తెలివిగా ఉండేవాన్ని. నాకొచ్చే జీతంలో ఎల్.ఐ.సి.కట్టేవాన్ని. 9వ వార్డు ఉడుత వెంకటయ్య ఇంట్ల చిన్న రూము తీసుకుని ఉండేవాన్ని. వాళ్ళు సాలోళ్ళు. వెంకటయ్య మనవరాలు యాదిలక్ష్మి పిచ్చిపిచ్చిగా ఉండేది. ఆమెనెవరూ పెళ్ళి చేసుకోరని వెంకటయ్యకు తెలుసు. నాకు ముందు వెనుక ఎవరూ లేరని కూడా ఆయనకు తెలుసు. వెంకటయ్య యాదిలక్ష్మికి, నాకు పెళ్ళి జరిపించాడు. నాకిద్దరు కొడుకులు. పెద్దోని పేరు వెంకటి. చిన్నోని పేరు చందు. చందు చిన్నపిల్లగాడు. చిన్నోడు అప్పుడప్పుడు వచ్చి నా దగ్గరున్న డబ్బులు తీసుకుపోతాడు అంటూ రాములు కొడుకు మీద ప్రేమతో కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
నవేంద్రియాలలో కళ్ళే ప్రధానమన్నారు పెద్దలు. కాళ్ళు చేతులు గూర్చి ఎక్కడా ప్రస్తావించినట్టు లేదు. నేటి ఆధునిక వైద్య విజ్ఞానంలో కళ్ళు పోతే కళ్ళు పెట్టవచ్చు. ముక్కుకు సంబంధించిన వ్యాధులను నయం చేయవచ్చు. మొద్దు బారితే మెదడు చేత పని చేయించవచ్చు. ఇవి జ్ఞానేంద్రియాలు. వీటితో జ్ఞానాన్ని సంపాదించి, సంపాదించిన జ్ఞానంతో ఆహారాన్ని, వస్తువులను తయారు చేసుకోవడానికి అవసరమైన ప్రణాళికను జ్ఞానేంద్రియాలే అమలు చేయలేవు. ప్రణాళికను అమలు చేయవలసినవి కాళ్ళు చేతులు. కాళ్ళు చేతులు అనేవి ప్రణాళికను లేద పనిని సాధించి పెట్టే సాధనాలు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|