|
|
Articles: Poetry | దేవుణ్ణీ బెదిరిస్తా - Mr. VENKAT ESWAR RAO
| |
ఏడు కొండలెక్కామని
నీ కోసం వేచామని
అబ్బో ఎంత భక్తని
మురియబోకో యెర్రి ఎంకటేసా!
కష్టాలొస్తే కన్పిస్తావ్
కన్నీళ్లొస్తే ప్రార్థిస్తాం
ఆ రెండు దాటేస్తే
మళ్ళా మన దూరం మామూలే!
కోరికల మూటతో
నీ కాడికొచ్చి
నీకు కొంచెం లంచం
ఇచ్చి
నీ శక్తి పరీక్షిస్తాము
ఇంకా
.........
అంటే
తలనీలాలు
నిలువు దోపిడీలు
.........
కోరిక తీర లేదా?
వేరే దేవుణ్ణి
వెదికేస్తాం!
మాకేం కొదవా?
కో అంటే ముక్కోటి!
కానుకల వెనుక
కోరికల కాముకత్వం
ఏమిటీ విపరీతం
వింత తత్వం?
మర్చిపొయ్యా
గుర్తొచ్చావోయ్
మరోసారి
డబ్బు జబ్బు చేస్తే
ఆది అన్యార్జితమైతే
మరీ మరీను!
కానీ స్వామి
ఒకటే సందేహం!
నీవే స్వయంగా సెలవిఛ్చిన గీతలో
చతుర్విధా భజంతే మాం శ్లోకంలో
మా స్థానం ఏదో మాది ఏ కోవో ఏ త్రోవో
చెప్తే బోలెడు భక్తులను అందిస్తాం!
నీ ఆరాధన కార్యక్రమాన్ని
అలుపు సొలుపు లేని రీతిలో
అతి సులువుగా
సరళీకరించాం! కుదించేసాం!
మరి నీవో....?
నీవేమీ తీసిపోలేదులే!
మా సుఖాలపై
మాకుండే ప్రేమ
ఎంత చక్కగా సృష్టించావో
అంతే బలీయంగా
నీ దర్శనార్థం
ఇంచుకైనా ఇవ్వక
మాయ చేసి
మోసం చేస్తావా?
ఎంత పక్షపాతం
రెంటి మధ్య
ఎంత వ్యత్యాసం!?
మేమూ చూస్తాం
ఎంత కాలమో?
ఎన్ని జన్మలో
ఈ నిరీక్షణ!
భక్తిలో కలిగే ప్రశాంతతను
అభిలషించడం కూడా
స్వార్థమే కదూ...?
నీ ఊసే వొదిలేసి
సకల జీవరాసిలోనూ
నిను దర్శిస్తూ
సమానత్వాన్ని
ప్రదర్శిస్తూ
సేవిద్దామంటే
ఎంత వరకది సాధ్యం?
ఎంత మందికది ఆమోదయోగ్యం?
ఈ దానం
సకల జీవ సేవ ఫలం
తిరిగి స్వార్థానికై
స్వాభివృద్ధి కాంక్షతో
ఆ పుణ్య ఫలం
అభిలషించడం కన్నా
భక్తిలో కలిగే
ఆ స్వార్థపు ప్రశాంతతే మిన్నేమో?
తిరిగి రాని గతాన్ని కోరుకుంటూ
తెలియని భవిష్యత్ కై కలలు కంటూ
కాలం గడిపేసి
కాటికి కాలు చాపేసి
ఆ సంయమి ఘన్టల నాదం వినిపిస్తుంటే
క్షణం క్షణం భయపడుతూ
బ్రతుకు కొరకై భగవంతుణ్ణి
ప్రార్థించడం
ఎంత నికృష్టం
??????
కుళ్ళిన పండుని నివేదించడం
అదే కదా?
అందుకే
......
జవసత్వాలు తొణికిసలాడే ప్రాయంలోనే
చేవ చావని తరుణంలోనే
పూరాకృత సంచిత ప్రారబ్ద
కర్మ ప్రక్షాళన సాగిద్దాం
జనన మరణ వలయాలు ఛేదిస్తూ
చేరుకుంటాము
నీ పాదాల చెంతకి!
ఇందు కోసం
నీ పొందు కోసం
నిన్నే బెదిరిస్తా!
లొంగకుంటే ఎదిరిస్తా!
పోరాటం సాగిస్తూ
నీ దరి చేరాలనే
ఆరాటంతో
ఆవేశంతో
ఆశీర్వదించామని
విజయార్థినై
నిన్నే ప్రార్థిస్తూ....!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|