|
|
Articles: Poetry | మరుగుజ్జు పెద్దలు! - Site Administrator
| |
(పిఎస్.నాగరాజు)
బెత్తం ఊతం లేనిదే
తరగతి గదిలోకి అడుగు పెట్టేందుకు
తెగ అదిరిపడే పిరికి అయ్యవార్లూ!
పిల్లల కేరింతలంటే ఎందుకలా వణికిపోతారు?
వాళ్ళ అమాయకమైన కళ్ళ పాలపుంతలోకి తొంగిచూడండి!
మీ నిస్సహాయమైన ఆగ్రహం సిగ్గుతో చచ్చిపోతుంది!
సెలవిచ్చేసరికి, ఇల్లు తీసి పందిరేస్తారని నిందించే
అసహనం పోతపోసిన అమ్మా నాన్నల్లారా!
పిల్లల సంతోషం చూసి ఎందుకలా బెదిరిపోతారు?
వాళ్ళ బుగ్గల్లో సెలలూరే తేనె తెలుగు ఊటల్ని చీదరించుకోక తాకండి,
మీ నిష్కారణమైన 'ఆధిపత్య' క్రోధం అక్కడ నిలువునా చివికిపోతుంది!
ఇరుకు మనస్సుల్లాంటి మన అడ్డుగోడల గదుల్లో ఇమడలేని
చిన్నారుల పెదవుల వెలుగు అలల్ని
క్రమశిక్షణ కత్తెరలకు బలిచేయాలని
ఉబలాటపడే మొండి పెద్దరికాల్లారా!
తెలుగును నిషేధించి తెలివిని పండించాలనుకునే తలకిందుల మోజుల్లారా!
స్వేచ్ఛలో స్వచ్ఛతనీ, సృజనలో వికాసాన్నీ, సహజ చలనంలో మాధుర్యాన్ని
చవిచూడలేని పెరుగుదల మీది!
పళ్ళు బిగిస్తూ - కళ్ళు ఎర్రగా మండిస్తూ
మీరు చేసే సవాలక్ష దోషాల్ని
అన్యాయంగా వాళ్ళ లేత వెన్నుపూసల మీదికి నెట్టేస్తున్న
బాధ్యతలేని బాధ్యుల్లారా!
ఓ పెత్తందారీ నేరస్తుల్లారా!
ప్రేమ - స్నేహం - నిబద్ధత
నిజాయితీ - నిరంతరశ్రమ - నమ్రత
మీ కృతక వికార ఏకపక్ష అదుపాజ్ఞల కట్టడుల్లోంచి రావండీ!
పూలతోట వసంతాన్ని గానం చేసినట్లు
తెలుగుపాట వెలుగుబాటల్ని పరచినట్లు
వెన్నెల నింగి ఆహ్లాదాన్ని బొమ్మ గీసినట్లు
నెమలికన్ను హరివిల్లును వికసించినట్లు
మనస్సును హృదయంతో శిల్పించే
ఉలి చలన వాత్సల్యం ఉదయపుష్పాన్ని ముద్దాడాలి!
బెత్తాలూ - తిట్లూ - రాట్లూ...
ఈ శిక్షాస్మృతుల్ని విస్తృతంగా జారవిడుచుకుని వెళ్తున్న కొద్దీ
చదువుల బడైనా - ఇల్లైనా - వాకిలైనా - ప్రపంచమైనా - ఎక్కడైనా
తెలుగక్షరాల శ్వాస కోసం పొత్తిలిలోని బాల్యం
మలయమారుతానికి పరిమళాన్ని కానుకగా పొదుగుతుంది!
ఎదగడం తెలియని మరుగుజ్జు పెద్దల్లారా!
మిమ్మల్ని తాము జ్వలించుకునే విశ్వకాంతి జనకాలు - 'పిల్లలు'!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|