|
|
Articles: Poetry | మౌనం - Site Administrator
| |
(ఆచార్య పి.వెంకటరెడ్డి)
ఎవరో ఏదో అన్నారని
మౌనాన్ని త్యజించకు
దిశా నిర్దేశం లేని నిరాసక్త మౌనం
ఒంటరితనంలో ఇమడలేక
ఆవహించిన ఏకాంత మౌనం
సుదూర తీరానికి విసిరేస్తుంది.
కాలం నిర్మించిన రహదారిలో
నైరాశ్యం, నిస్పృహలతో
మూకాభినయ ప్రదర్శనలు
నగ్న నిస్సహాయతలు
మౌనానికి ఒక పార్శ్వం మాత్రమే.
అంతర్ముఖులైన విజ్ఞుల మౌనం
ప్రశాంతతకు, గాంభీర్యానికి
విజయానికి సంకేతం
మౌనం అంటే
కఠోర వాస్తవాల భాండాగారం
అడుగడుగున ప్రతి కదలికలో
తీక్షణ వీక్షణల్లో సైతం
సంచలనాత్మక ఆలోచనలు
రవి కిరణాల్లా దూసుకువస్తాయి.
మౌనం ఎప్పుడూ శ్రుతి తప్పదు
మానవాళికి నిత్యం శుభసంకేతాలే.
మౌనం అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది
అమేయ స్పందనాయుత చర్యలన్నీ
ప్రజాహిత కార్యకలాపాల కొరకే
నిత్య సత్యాల ఆవిష్కరణల కొరకే
సత్యశోధన సంశ్లేషణ, విశ్లేషణలే
ధరిత్రిలో మానవ మనుగడకై
మానవీయత సడలకుండా
ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ
మంచి చెడులను బేరీజు చేస్తూ
మౌనం నిశ్శబ్ద యుద్ధం ప్రకటిస్తుంది.
మౌనం అంటే గంభీర సాగరం
మౌనం అంటే విశాల వినీలాకాశం
మౌనం అమ్ముల హృదయతూణీరంలోని
అపూర్వ మనశ్శక్తిని
అమోఘ విచక్షణా జ్ఞానాన్ని
జీవిత విలువలను, ఆత్మ విశ్వాసాన్ని
ఆవిష్కృతం చేయడం
అంటే...
మౌనం నుండి చైతన్య వాస్తవాలను
వెలికితీయడమే.
మౌనం ప్రకటించే
అప్రకటిత నిశ్శబ్ద యుద్ధమే.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|