|
|
Articles: Poetry | సత్యం - అసత్యం - Site Administrator
| |
(సప్రం గణేష్ బాబు)
ప్రవహించే సత్యాన్ని ఇంకుడుగుంతల్లోకి మర్లించి
అబద్దాల నీడల్లో వేలుపట్టుకు నడిపిస్తున్నారు
ఇప్పుడు నీ కళ్ళు చూసేవి నీ చెవులు వినేవి
రెండూ అక్రమ సంతానమే
నీ రక్తంలో జీర్ణమయింది
నీ జీవితంలో అల్లుకుంది
ఎవరో విసర్జించిన అశుద్ధానికి రూపాలే
నీ గుండె మీద చిత్రించుకున్న చిత్రాలు
నీ ఒంటి మీద జల్లుకున్న రంగులు
నువ్వు వెనుతిరిగి చూడక ముందు జరిగిన
వెన్నుపోట్లకు సాక్ష్యాలే
వేల సంవత్సరాల నిర్మాణంలో జన్మించిన ఈ అసత్యాలు
ఇప్పుడు గుంపులు గుంపులుగా పరిణామం చెంది
రెక్కలు కట్టుకొని మన చుట్టూ ఎగురుతూ
జీవితాన్ని చెక్కుతున్నాయి
ఏ పక్క చూసినా ఏ పక్క విన్నా ఏ పక్క మర్లినా
కమ్ముకున్న ఈ వారసత్వ సంపద మనం పెంచి పోషించే
బిడ్డలై మన గుండెల మీద ఆడుకుంటున్నాయి
నిజాన్ని పోగొట్టుకోవడంతో ప్రారంభమైన ఈ ప్రహసనం
మనిషిని మనసుని ఆత్మని
పోగొట్టుకోవడంతో ముగుస్తుందేమో
పోగొట్టుకున్న వాటితో పొద్దు పొడుపు
సిగ్గుతో కమిలిపోయి ఎర్రగా ఉరుముతుందేమో
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|