|
|
Articles: Poetry | రుధిర స్వేదం - Site Administrator
| |
(సప్రం గణేష్ బాబు)
పావు చెక్కల మీద రెండు కాళ్ళు
జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తే
నాడి ఆ చెరుగులో నుంచి ఈ చెరుగులోకి
ఈ చెరుగులో నుంచి ఆ చెరుగులోకి
దారంతో కాలాన్ని గజాలుగా కొలుస్తుంటే
ఎముకలు అరిగేదాక
సగం గుంట ప్రహసనం
బ్రతుకు పోరాటాన్ని ఆవిష్కరిస్తుంటుంది
పడుగు పేక కలబోత అల్లిక
ఏ అర్ధరాత్రో రెప్పల బరువులో
కాసేపు ఆగిందనుకుంటే
వేకువ వాకిట్లోకి రాక ముందే
మగ్గం వళ్ళు విరుచుకుంటుంది
ఐదు వేళ్ళు ఎంగిలి పడడటానికి
పిల్లలకు నాలుగక్షరాలు
బలపం పట్టించి దిద్దించడానికి
సాధారణమైన శుభ అశుభ కార్యాలకి
పొరపాటుగా సహజాతంగా ఏ జబ్బో చేస్తే
ఏ దవాఖాన మెట్లయినా ధైర్యంగా ఎక్కడానికి
భుజాలు వంగేదాక పాదాలు పేళ్ళు కట్టేదాక
ప్రాణాలు విరుచుకుంటూ ఎంత లయబద్ధంగా నేసినా
వంటి మీది బట్టల్లోంచి చినుగులు ఓరగా వెక్కిరిస్తుంటే
చిల్లులు పడ్డ పైకప్పు ఖాళీలో నుంచి చినుకులు
ఇంటి చుట్టమై అతిథి మర్యాదలు కోరుకుంటాయి
ఊహ తెలిసిన దగ్గర నుంచి ఊపిరాగేదాక
మూడడుగుల గుంట నుంచి ఆరడుగుల గొయ్యిదాక
నాగరికత అందమైన పోకడలను
మానవత్వపు మాన సంరక్షణా బాధ్యతను
సమర్ధవంతంగా అందుకున్నా
అసమర్థులుగా కనిపించే అశ్రు జల పాయలం మేము
ఆరు గజాల చీరను అగ్గిపెట్టెలో పెట్టిన తీరుగానే
పైకి అందంగా కనిపించే కళాఖండాలం మేము
చేనేత కార్మికులం మేము.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|