|
|
Articles: TP Features | వోటు మారితే సీటు 'చే'జారినట్టే! - Site Administrator
| |
మహాకూటమి ఏర్పాటు తెలంగాణా ప్రాంతంలో మొదట్లో కాంగ్రెస్ పార్టీని కలవరపరిచింది. కూటమిలోని నాలుగు పక్షాల మధ్య 'వోట్లమార్పిడి' సవ్యంగా జరిగితే కాంగ్రెస్ పని 'ఖాళీ' అని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ సీట్ల పంపకంలో ఆ పార్టీ మధ్య జరిగిన చర్చ, ఇప్పటికీ పది , పదిహేను స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఇద్దరేసి ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరి పీల్చుకోగలిగింది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. మిగతా తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ - కూటమి మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. తెలంగాణలో ప్రజారాజ్యం పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. దేవేందర్ గౌడ్, కాసాని జ్ఞానేశ్వర్, మన పార్టీ పెద్ది రెడ్డి, మల్కాజ్ గిరి, చేవెళ్ళ లోక సభ స్థానాలు, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, హస్నాబాద్ అసెంబ్లీ స్థానాల్లో సైతం ఆ పార్టీ పెద్దగా పుంజుకోలేకపోయింది. పిఆర్పీలో విలీనమైన నవ తెలంగాణా పార్టీ నేత దేవేందర్ గౌడ్, ఆపార్టీతో పొత్తుపెట్టుకుని పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ లోక్ సభతో పాటు, అసెంబ్లీకి కూడా పోటీ చేయడం వారిలో ఆత్మస్థయిర్యం లోపించిందనడానికి నిదర్శనం.
మహాకూటమి ఏర్పడిన తొలి వారం, పది రోజుల్లో ఉన్న ఉత్సాహం ఆ తర్వాత నీరుగారి పోయింది. సీట్ల పంపకంలో జరిగిన జగడాలు, టిక్కెట్లు దొరకనివారు తెలుగుదేశం, టిఆర్ఎస్ కార్యాలయాల వద్దే ధర్నాలుకు దిగిన సంఘటనలు, అధినేతలు ఎంత హూంకరించినా వెనక్కి తగ్గని రెబెల్స్ కారణంగా మహాకూటమి కొంత బలహీనపడింది. మహాకూటమి ఏర్పడిన తొలినాళ్ళలో అది తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 80 - 90 స్థానాలు కైవసం చేసుకోగలదన్న అంచనాలు, విశ్లేషణలు జోరుగా సాగాయి. తమకు కేటాయించని సీట్లలో కూడా టిఆర్ఎస్, తెలుగుదేశం అభ్యర్ధులు పోటీకి దిగడం, ఆ పార్టీల అధినేతలే అందుకు పురిగొల్పడంతో మహాకూటమి పక్షాల మధ్య పరస్పరం విశ్వాసం సన్నగిల్లింది. దానితో కూటమి గెల్చుకోదగిన స్థానాల సంఖ్య 70కి దిగువకు పడిపోయింది. 'వోటు మార్పిడి' మీద కూటమిలోని అన్ని పార్టీలకూ మొదటి నుంచీ అనేక అనుమానాలున్నా పరిస్థితి మరీ ఇంత అధ్వాన్నంగా ఉండదని భావించారు. కానీ ఇప్పుడు కూటమిలోని పక్షాలు మరీ ముఖ్యంగా వామపక్షాలు బాగా దెబ్బతినే ప్రమాదం ఉంది. మహాకూటమి ఏర్పాటు వల్ల అందులోని భాగస్వామ్య పక్షాలకు లాభం చేకూర్చుతుందా లేక మొదటికే మోసం వస్తుందా అన్నది అంతుబట్టడం లేదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|