|
|
Articles: TP Features | మహిళల పాలిట కల్పవృక్షం - Site Administrator
| |
కుల తత్వం, మత తత్వం, ప్రాంతీయ తత్వం, స్వార్థపరత్వం, ఆశ్రిత పక్షపాతం, అన్యాయం, లంచగొండితనం, దోపిడీ మనస్తత్వం, అరాచకత్వం రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయని వాపోవడం కాక దుర్గాబాయి జీవితాన్నుండి స్ఫూర్తి పొంది, ఆమె చెప్పి, చేసిన సేవా కార్యక్రమాల విస్తరణకు పూనుకోవడమే ఆమెకు సరైన శతజయంతి నివాళి.
దుర్గాబాయి బాల్యం నుండే ఆత్మవిశ్వాసంతో లక్ష్యసాధన సాధ్యమేనని తన జీవన ప్రస్థానంలో ఆచరణాత్మకంగా నిరూపించింది. అంతేకాక ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకుని, ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో సమర్థతను పెంచుకుంటూ లక్ష్యాలను చేరాలి. ఉత్తమ నాయకత్వ లక్షణాలకిది చుక్కాని వంటిది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే ఎంతటి క్లిష్టపరిస్థితిలోనైనా విజయం సాధించవచ్చు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అవకాశాలు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటాయి. వాటిని గుర్తించి, అందిపుచ్చుకునే నైపుణ్యం పెంచుకోవాలి. అందుకు ఆత్మవిశ్వాసం, దృఢదీక్ష, హృదయ నిర్మలత్వం మూలకందాలు. ఇందుకు సమయపాలన ఎంతో కీలకం. ప్రతి సెకనూ ఎంతో విలువైనదే! అదే ఆమె ఆచరణలో చూపెట్టింది. స్వదేశీ, స్వాలంబన దిశగా తన కార్యాచరణను రూపొందించుకుని, బాల్యం నుంచీ ఖద్దరు వడికి, ఖద్దరు ధరించి ఎందరికో స్ఫూర్తినిచ్చింది.
ప్రపంచ చరిత్రలో ఇంత పిన్న వయస్సులోనే ప్రజ్ఞాశీలత, నిర్భీతి, ధైర్య సాహసాలు, పట్టుదల, జీవితలక్ష్యం పట్ల స్పష్టత, చైతన్యశీలత, సామాజిక స్పృహ, సదవగాహన, వాక్పటిమ, మృదుత్వం అన్నిటికీ మించి నిరాడంబరత, స్వావలంబనకు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు, సమాజ సేవకు, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నడుం బిగించినవారు మరొకరు లేరు అనడం అతిశయోక్తి కాదు. ముతకచీరలో కూడా మెరిసిపోయిన సేవలతల్లి, ధృవతార, భావితరాలకు కూడా స్ఫూర్తి ప్రదాత డాక్టర్ దుర్గాబాయి. ఆమె తెలుగుతల్లి అనుంగుబిడ్డ కావడం తెలుగువారి అదృష్టం.
(కీర్తిశేషురాలు దుర్గాబాయి దేశ్ ముఖ్ జన్మించి జూలై 15 నాటికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ వ్యాసం)
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|