|
|
Articles: Short Stories | పాలమ్మ - Site Administrator
| |
'మా మందల కొడ్తవానె కిట్టన్నా...' అనడిగిండు బర్ల మల్లిగాడు.
'ఏందిరో... ఇవి ఊరు మందల తిరగే బర్లలెక్క కనవడ్తున్నాయిరా... సెపరేటుగా పాలేర్ను పెడ్తన్నం' మాయిల్లమే ఎల్తిపడుకుంట చెప్పింది కిష్టరెడ్డి భార్య. బర్లకు మూడుసార్లు జిట్టి తింపింది.
'గా పోతు చూసినావె లస్మవ్వా... ఎట్లున్నదో... యములోని వాహనం లెక్కనే ఉన్నది' అన్నడు చిందు రామన్న.
లస్మవ్వకు ఇప్పుడన్ని బర్రెలూ యములోడి వాహనాల్లెక్కనే కనవడ్తున్నయ్... భయమైంది... పెయ్యంత జరమచ్చినట్టు సవసన అన్నది. అగులు బుగులై ఇంటి దిక్కు నడిసింది.
గడ్డిమోపు ఇంక బరువనిపిచ్చింది...
ఇంటి దగ్గరి సందుల మోర్లు కడ్తుండ్రు... తొవ్వంత పొక్కిలి లెక్కయింది.
'సంకరజాతిని ప్రేమిస్తరు... ఏం మనుషులో...జాతి గాదు మనసులు సంకరం కావద్దు... రాన్రాను పాలపిట్టకు గండుపిల్లికి లెంకగడ్తరు గావచ్చు' అనుకుంది.
బురదల అడుగుదీసి అడుగెయ్యత్తలేదు.
పాలు నీల్ల లెక్క కల్సిపోయిన మనిషిని, ప్రకృతిని, శ్రమని ఎవలో విడగొడ్తుండ్రని భయమేసింది లస్మవ్వకు...
మనసంత పొగవట్టినట్టు... కూరాడు కుండ పగిలినట్టు ఒక్కసారి తల్కాయల నొప్పి షురువైంది... 'పరాయిదేదన్నా... ఈల్లకు పప్పుబెల్లమే' అని చీదరించుకుంది.
అప్పుడే బురదల కుడికాలు జర్రున జారింది... సర్రున ఇరుసుక పడ్డది... గడ్డిమోపు ఎగిరిపడ్డది... 'కొడుకా...' అన్నది నడుం పట్టుకుంట...
'అయ్యో... ముసల్ది పడ్డది' ఎవలో అన్నరు... అందరు ఉరికచ్చిండ్రు... ఇంట్లకెల్లి కోడలు ఉరికచ్చింది ఏడ్సుకుంట...
ఇద్దరు లావట్టి ఇంట్లకు తీసుకచ్చి మంచంల పండవెట్టిండ్రు... కోడలు బురదంటిన చీరె విప్పి వేరే చీరె చుట్టింది. ఎవలు చెప్పిండ్రో గానీ... కొడుకు రాజేశం ఆరెంపీ డాక్టర్ ను తోలుకోని వచ్చిండు.
'ఎట్ల పడ్డవే అవ్వా...' అని ఏడ్సుడు మొదలు పెట్టిండు. ఆరెంపీ ఇంజెక్షన్ ఇచ్చి గుల్ కోస్ పెట్టిండు. పక్కకు పొర్లిచ్చి చూసిండు.
'నడుం బొక్క పర్రెవాసినట్టుంది... అతుకుడు కష్టమేనే రాయేషమన్నా... ఇగ మంచిగ చూసుకోండ్రి. గుల్ కోస్ దిగేవరకస్తా...' అని పోయిండు.
ఎనుకనే 'మరి జయితాలకు తీసుకపొమ్మంటరా' అనుకుంట నడిసిండు రాజేశం.
కోడలు సుజాత ఏడ్పు కూడా తరమైతలేదు.
'నాకేం కాలేదు బిడ్డా... గట్ల పరేశాను గాకుండ్రి... పాలెవలు పిండాలె బిడ్డా... రేపొద్దుగాల వాడకపోల్లకైతే పాలు పోసి రండ్రు' అన్నది లస్మవ్వ.
'నువ్వేం రంది పెట్టుకోకు అత్తా... వాడుకాలు నీ కొడుకు చూసుకుంటడు' అనుకుంట తలాపుకు కూసోని కొంగుతోని ఇసుర్తాంది సుజాత.
వాడల అందరు ఒక్కొక్కల్లు చూసి పోనత్తుండ్రు.
'కోడలు పొల్లకు కట్టమచ్చింది... ముసల్ది మంచం నేసుడే... ఇగ లేసుడు కష్టమే' అనుకుంట పోతుండ్రు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|