|
|
Articles: Short Stories | ఎంజాయ్ - Site Administrator
| |
(జి.ఎస్.లక్ష్మి)
`ఏంటి... నీ కొడుకులివాళ ఫోన్ చేస్తారంటావా...'
పొద్దున్నే సుమతి ఇచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ అడిగాడు శంకర్రావు.
మరే... ఫోన్ చెయ్యనప్పుడు నా కొడుకులూ, చేసినప్పుడు మీ కొడుకులూనూ...
అవునూ, కాదూ అని సమాధానం చెప్పకుండా శంకర్రావు మాటని అతనికే తిప్పి కొట్టింది సుమతి
మరి లేకపోతే... అక్కడ వాళ్ళు చేస్తున్న ఘనకార్యాలేంటిట... వారానికి అయిదు రోజులే పని..
రెండు రోజులు శెలవులేనాయే... ఆ రెండు రోజులకూ ఉన్న నలభై ఎనిమిది గంటల్లో కనీసం నాలుగు నిమిషాలు మనకి ఫోన్ చెయ్యడానికి కుదరదూ వాళ్ళకి... మనసుంటే మార్గం ఉంటుంది...
నిజంగా ఆలోచిస్తే అంతకన్నా ఎక్కువగానే లెక్కలేస్తోంది సుమతి. కాని కొడుకుల్ని తప్పు పట్టడానికి అమ్మ మనసు అంగీకరించలేదు. వారంలో అయిదు రోజులూ వాళ్ళకి తిండి తినే దృష్టి కూడా ఉండదు. శనాదివారాలే కాస్త వండుకున్నా... ఇల్లు సర్దుకున్నా... బైట నుంచి సామాన్లు తెచ్చుకున్నా... ఎన్నో పన్లు ఆ రెండు రోజులకీ అట్టిపెట్టుకుని ఆఖరికి ఆదివారం రాత్రికి కొన్ని మాత్రమే చేసుకోగలుగుతారు.
అక్కడ అన్ని పన్లకీ వాళ్ళే. తుమ్ముకున్నా వాళ్ళే... చిరంజీవి అనుకున్నా వాళ్ళే. మాటసాయం, మనిషి సాయం లేకుండా విపరీతమైన ఒత్తిడులని తట్టుకుంటూ, దేశం కాని దేశంలో పిల్లలు పడుతున్న బాధ ప్రత్యక్షంగా చూసొచ్చిన సుమతికి వాళ్ళని తప్పు పట్టడానికి మనసొప్పలేదు. అదే చెప్పింది శంకర్రావుతో...
అన్నీ చూసొచ్చిన వారు, తెలిసున్న వారు. మీకు నేను చెప్పాలా..
పోనీ కోడలికైనా కాస్త గట్టిగా చెప్పొచ్చుకదా నువ్వు... ఊరుకోలేదు శంకర్రావు.
కొడుకుతో మాట్లాడి వారం దాటితే చాలు మరింక అతన్ని పట్టుకోలేం. ఒక్కసారి చంటిపిల్లాడి ఏడుపు విన్నా చాలు కదా... అసలు కంటే వడ్డీ ముద్దని స్పష్టం చేశాడు.
సర్లెండి... వాడు చేసినప్పుడు చెబుతా అంటూ మాట దాటించేసింది సుమతి.
ప్రతి ఆదివారం ప్రొద్దున్నా వాళ్ళింట్లో కార్యక్రమం ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అప్పటి తరంలో చాలామంది లాగే శంకర్రావు కూడా ఉద్యోగరీత్యా సొంత ఊరు వదిలి పట్నంలో కాపురం పెట్టి అక్కడే సెటిలయ్యాడు. ఉద్యోగం చేసినన్నాళ్ళూ రోజులో ఇరవై నాలుగు గంటలూ అదే ధ్యాసలో ఉండడం వలన వేరే విషయాలు ఆలోచించడానికి టైముండేది కాదు. ఒక్కొక్క మెట్టూ ఎక్కి కాస్త హోదా పెరిగే సరికి పిల్లలిద్దరూ పెద్దచదువులకొచ్చేరు. మరింక వాళ్ళని ఒకదారిలో పెట్టి, పెళ్ళిళ్ళు చేసి సెటిల్ చేసేటప్పటికి పెద్దబ్బాయి కాలిఫోర్నియాలోనూ, చిన్నబ్బాయి షికాగాలోనూ సెటిలయిపోయేరు.
| Read 5 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|