|
|
Articles: TP Features | ఉసురు తీస్తున్న ఓటమి - Site Administrator
| |
ఎనభయ్యో దశకం దాకా మనవాళ్లది పొదుపుచేసే నైజం. అప్పో సొప్పో చేసి వస్తువులు కొనటం కన్నా ఉన్నదానితో సర్దుకోవటానికే మొగ్గు చూపేవారు. మిక్సీలు, ఫ్రిజ్‌లు, ఆఖరికి ఇల్లైనా అదే ధోరణి. అందుకే అప్పట్లో ఎక్కువశాతం మధ్యతరగతి వారు ఉద్యోగం నుండి రిటైరయ్యే నాటికి గానీ సొంత గూడు సమకూర్చుకోలేకపోయేవారు. మరి ఇప్పుడో? అంతా పోటీ. పక్కవాడికి ఉన్నదాన్ని అప్పు చేసి అయినా తానూ సొంతం చేసుకోవాలన్న ఆరాటం. కోరుకున్నది సొంతం కాకపోతే తట్టుకోలేని అసహనం.
దీనికి తోడు, పిల్లలకు చిన్నప్పటి నుండీ ప్రతి విషయంలోనూ పోటీ తత్వాన్ని నూరిపోసే గుణం కూడా ఎక్కువైపోయింది. జీవితంలో ప్రతి విషయాన్నీ గెలుపోటముల కోణంలో నుండే చూసే లక్షణం నేటి తరానికి నేర్పుతున్నారు. పోటీ మంచిదే. అయితే, పోటీపడిన ప్రతి ఒక్కరూ గెలవలేరనే తెలివిని కూడా నేర్పాలి కదా. తల్లిదండ్రుల పెంపకంలో తేడా రావల్సిందేమన్నా ఉందంటే అది ఈ విషయంలోనే, వయసు ఆకర్షణ గురించి బోధించటంలో కాదు. పిల్లల ఓటమి ఉసూరుమనిపించొచ్చు, కానీ ఉసురు తీసేది కాకూడదని తల్లిదండ్రులు నేర్పాలి.
ఓటమిని జీర్ణించుకోలేని స్థితిలోకి భారతీయులు జారిపోతున్నారనేదానికి ఉదాహరణలు రోజూ టీవీల్లో రకరకాల పోటీ కార్యక్రమాల రూపంలో మనకి కనిపిస్తూనే ఉన్నాయి. పాటల పోటీలు, నృత్యాల పోటీలు, క్విజ్ ప్రోగ్రామ్స్ .. ఏది తీసుకున్నా, చిన్నా పెద్దా తేడా లేకుండా ఓడిపోతే ఏడవకుండా వెనుదిరిగేవాళ్లు ఒక్కరున్నారా? ఓటమిలో హుందాతనమేది? పబ్లిక్‌గా ఏడవటంలో ఏం డిగ్నిటీ ఉంటుంది? పదేళ్ల క్రితమూ ఇలాంటి పోటీలు జరిగేవి - ఇంత విరివిగా కాకున్నా. అప్పుడూ ఓడిపోయిన వాళ్ల బాధ వాళ్ల మొహాల్లో కనపడేది. తేడా అల్లా - అప్పట్లో ఇలా ఏడుపులూ పెడబొబ్బలూ ఉండేవి కావు. అందుకే వినిమయ తత్వాన్ని, పోటీ తత్వాన్ని ప్రేమకు ముడిపెట్టకపోతే ఘారాలు, నేరాలకు తావివ్వని సమాజాన్ని నిర్మించుకోవచ్చు. ఓటమిని ప్రతీకారంగానో, ప్రాణాలు తీసేదిగానో, తీసుకునేదిగానో చూపించే పరిస్థితి నుంచి మనం బయటపడాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|