|
|
Articles: TP Features | కప్పరాజు శాసనం! - Site Administrator
| |
తమదే అందలం అనుకుంటే, పరుల హస్తగతం అయిందని తెలుగుదేశం ఓటమి గాయాలకు భవిష్యత్ ఆశల పట్టీ వేసింది! కానీ 2014 ఎన్నికలపై కన్నేసిన రాజన్న... అధికారపు మెరుపులతో కొందరిని ఆకర్షించారు! తెలుగుదేశంలో లేఖల కలకలం బయలుదేరింది. విరుగుడెలాగా? అని చంద్రబాబు గడ్డం పీక్కుంటుంటే... మాజీ 'నెంబర్ టూ'కి స్వగృహం బెంగపట్టుకుంది. ఇంకే! 'బాబూ! నీవే మా మంచి బాబువి! ఇక నిన్నెన్నడూ వీడని నీడను నేను' అంటూ చారిత్రక తప్పిదం చేశానని గతాన్ని నెమరువేశాడు! దేవేందర్ గౌడ్ ఇంటి బాట మరికొందరికి బాటలు పరిచింది!
ప్రత్యేక వాదంతో పోటీచేసి చతికిలపడిన కేసీఆర్ ని 'ఉన్నావా! నీవున్నావా? అసలున్నావా' అంటూ పార్టీ శ్రేణులు వెంటాడాయి. అసమ్మతులు రేగాయి. కొత్త సంస్థ పుట్టింది. చెల్లెమ్మే అనుకుంటే... రాములమ్మ కూడా కారాలు మిరియాలు నూరుతోంది. 'కేసీఆర్ చేతన్, కూటమి చేతన్... నా చేతన్' అంటూ ప్రత్యేక వాదం మాయమైందని వైఎస్ సోనియాగాంధీకి వివరించారు.
చంద్రబాబును ప్రపంచబ్యాంకు జీతగాడు 'అంటూ' బషీర్ బాగ్ నుంచి ఉద్యమించిన వామపక్షాలు... ముఖ్యమంత్రిపై ఎలా పోరాడాలో తెలియక 'పార్టీ తీర్మానాలను' శోధిస్తున్నాయి. 'ముదిగొండ' కూడా తమను ఆదుకోలేదని ఆరా తీస్తున్నాయి. ఏ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం అంటూ ఓటరు నిట్టూరుస్తున్నాడు!
మళ్ళీ నీళ్ళు సుడులు తిరుగుతూ యథాతథా స్థితికి చేరాయి. కళ్ళు ఏ పార్టీ చూస్తున్నా సభ్యులైన కప్పలు ఒక్కసారిగా 'బెకబెక'మన్నాయి. ప్రజాసేవ అంటూ పార్టీలు చేస్తున్న 'ఫీట్లు' చూశాక వాటికి మతిపోయినట్లైంది. సమావేశంలో నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ 'నాయకపెద్ద'దైన కప్ప తన నిర్ణయాన్ని ప్రకటించింది. 'ఇక మీదట... కనీసం ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ లో నివసించే కప్పులు దూకరాదు. గెంతరాదు. అలా చేస్తే వాటిని 'రాజకీయ కప్పలు'గా భావించి బహిష్కరించి శిక్షిస్తాం' అని ప్రకటించింది!
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|