|
|
Articles: Short Stories | సాగరయానం - Miss rajeswari rajeswarinedunuri
| |
మర్నాడు ఉదయం ఐదు గంటలకే లేచి సన్ రైజ్ చూడాలని పన్నెండో అంతస్తు డెక్ మీదకి వచ్చాము. టీ, కాఫీలు రెడీగా ఉండటంతో కాఫీ కప్పులు చేత బట్టుకుని డెక్ అంచుల నిలబడితే ఎంత బాగుందని? కడలి కెరటాలను కసిగా చీల్చుకుంటూ ముందుకు దూసుకు పోతున్న షిప్పుకు సగరుడు తప్పుకుని దారి వదులుతున్నట్టుగా ఉంది. దూరంగా మరికొన్ని షిప్పులు లైట్ల కాంతితో రాబోతున్న ఉదయారుణ కిరణాలతో పోటీ బడలేక వెల వెల బోతున్నాయి. నలు వైపులా నీలి రంగు ఆకాశం సముద్రుని కౌగిలి వీడ లేక పోతోంది. తూరుపు వైపునుంచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్న సూర్యుడు మత్తు మత్తుగా బలవంతాన పై పైకి వస్తూ తన లేలేత ఎరుపు రంగుతో ఉషః కాంతులను విశ్వ మంతటా విరజిమ్ము తున్నాడు. సముద్రుని పై పడిన ఆ కిరణాలు తళుకు లీనుతున్న జలతారు తీగల్లా మెరుస్తున్నాయి. 'ఇలాంటి దృశ్యాన్ని చూసే కాబోలు అలనాటి ప్రభంధ కవులు సూర్యోదయ సూర్యాస్త మయాలను ఎంత బాగా వర్ణించారని? 'చకిత తారక లావల బార కాంతి సూత్రమ్ముల యుచ్చు లొడ్డెను సుతారపు తూరుపు వేటగాడు' అన్న ఉమర్ ఖయ్యాం' పద్య పాదం గుర్తు కొచ్చింది. చేతిలో వెచ్చని కాఫీ కప్పు చల్లని ఆహ్లాద కరమైన సాగర సమీరం ఇన్ని అందాలు తిలకించే తీరిక ఇక్కడ గాక మరెక్కడ ఉంటుందని? నిజంగా ఈ ప్రకృతిని తిలకించాలే గానీ వర్ణనా తీతం.
ఇక బలవంతాన కదిలి రూముకి వెళ్ళి స్నాన పానాదులు ముగించుకుని ఏముంది షిప్పు లో తిరగటమే పని. రోమియో లౌంజికి వచ్చాము. ఇక్కడ నిన్న రాత్రి డిన్నరు తర్వాత తీసిన ఫోటోలు గేలరీలో పెట్టి ఉంచారు. కావలసిన వారు తమ ఫొటొలను 8, 9 డాలర్లు పెట్టి కొనుక్కోవాలి. పక్కనే షాపింగు చేయాలనుకునే వారు డ్రస్సులు, వాచీలు, నగలు ఇలా కొనుక్కో వచ్చు. మరి కాస్త పక్కకి వెడితె లైబ్రరీ ఉంటుంది. అందులో పుస్తకాలు, పిల్లల ఆటవస్తువులు అన్నీ ఉంటాయి. మరొక వైపు క్లబ్బు, బారు తర్వాత ఆటలు, పాటలు, కాసినో గేములు అంతా గాంబ్లింగ్. మరొక అంతస్తుకి వెడితే స్టేడియమును మించి సీటింగు ఎరేంజి మెంటుతో పెద్ద ధియేటరు ఉంది. అక్కడ సినిమాలు నృత్య గానాలు, జ్యోక్స్, బింగో ఆటలు ఖుషీ ఖుషీగా, మజా మజాగ బోలెడు ఆకర్షణలు. ఇవన్నీ చూసుకుంటూ తిరుగు తుంటే లంచ్ కి టైం అయిందన్న సంగతే మర్చి పోయాము.
సరే లండన్ డైనింగు హాలుకి వెళ్ళాము. లంచ్ అంటే ఇండియన్ ఫుడ్ బఫే కాకుండా రాత్రిలాగే అన్నీ కొసరి కొసరి వడ్డించారు. టోనీ, లండన్లు. మళ్ళీ డిజర్ట్ వెన్నిల్లానే చెప్పేసరికి మామీ ఎప్పుడూ వెన్నిలా ఏనా? అని నవ్వారు. సరే ఇక తినడం కాగానే మళ్ళీ తిరగడం అర్ట్ గేలరీ లో అద్భుత మైన వర్ణ చిత్రాలను సందర్శించి అన్ని అంతస్తులు తిరిగి పదవ అంతస్తుకి వచ్చాము. ఇక అంతా స్విమ్మింగు మయం. కొందరు నీటిలొ ఈదుతుంటే మరికొందరు అదే డ్రస్సులో క్రీములు రాసుకుంటూ పూల్ చుట్టూ మంచం లాంటి కుర్చీల పై పడుకుని ఎదురుగా డెక్ కి ఉన్న పెద్ద ధియేటరులోంచి వస్తున్న కార్య క్రమాలను తిలకిస్తూ వినోదంగా ఒళ్ళంతా ఆరబెట్టు కుంటున్నారు. జనాలకి కన్నుల పండువుగా ఉంది.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|