|
|
Articles: Short Stories | స్వర్గ యాతన - Site Administrator
| |
ఆ శబ్దం మబ్బుల్ని గుద్ది తూర్పు కనుమలో దిగి మహేంద్రగిరిని గుద్ది మందసలో ఫెటిల్లున పేలిపోయింది. కళింగ సముద్రతీరం గుభిల్లుమంది. భారత ఫ్యాక్టరీ పొగగొట్టాలలోంచి పిడికిళ్ళు గప్పున లేచి గగనతలాన్ని పొడిచాయి. నాగళ్ళు నక్కులపైన నక్షత్రాలు కూలిపోయాయి. హరిపురం జంక్షన్ లో నేల గుబ్బుమంది. ఉద్దానం కొబ్బరికాయలు చిల్లులు పడ్డాయి. పనసల్లో పిక్కలు పొక్కిపోయాయి. వేలాడకుండా మునగకాడలు పైకిలేచి సూదిమొనలతో కొన్ని కలకత్తావేపు చూస్తే, మరికొన్ని పలాస వేపు తిరిగాయి.
'ఓలి గున్నమ్మా... లెగె లెగే...బేగి లెగే...' గగ్గోలుపెట్టి అరచింది కలకత్తా కాళిక. ఆ శిలారూపసి సాచిన నాలుకపైనున్న భయంకర రసాంకురాలు బుసబుసా పొంగడంవల్లనేమో పూరీ సముద్రం గుబ్బుగుబ్బున ఉబికింది. కోణార్క కిరణాలు ఆ నాలుకపైనున్న ఏ రుచిని గిచ్చాయోగాని కళింగుల కంఠాలు గుక్కలు వేయడానికి అంతేలేదు. పాలు చీకుతున్న పిల్లలు పెదవులు బిగబెడితే భూమాత గుండెలు గుభిల్లుమన్నాయి.
'డెబ్బయి ఏళ్ళు గడిచాయి.. ఇంక లెగే...'
'మూడవ ప్రపంచ యుద్ధం ముగింపుకొచ్చింది!... లేవే. సామ్రాజ్యవాదం భూస్వామ్యంతో కుమ్మక్కు. మవున యుద్ధం. మవులికాలన్నీ భగ్నం. బాంబులను పట్టించుకోలేదు. బీభత్సాన్ని సృష్టించారు. విలువలన్నీ రసికారుతున్నాయి. మూలుగుల్లో రక్తం పుట్టడం లేదు. ఎలక్ట్రానులన్నీ బొమ్మలైపోయాయి. మనసులు సిలికాన్ దిమ్మలైపోయాయి. మనమలూ, మనమరాండ్రూ రక్షణను అడుగుతాండ్రు. నన్ను శిల అనుకుంటున్రు. నువ్వు సచ్చినావనుకుంటున్రు. నాల్గవ ప్రపంచ యుద్దాన్కి సన్నద్ధమవ్వాల. సవ్వాలో, సంపాలో తేల్చుకోవాల. లెగు లెగు. కోక జుట్టుకుని కచ్చ బిగించు. చిలక సముద్రం పక్కనున్నాను. పారొస్తున్నాను... పోల్చుకో... సముద్రం పక్కనుండొచ్చి, వంశధారలో ముఖం కడుక్కొని, శాలిహుండం కొండెక్కి, నా అరసవిల్లి సూరోడు కుర్రోడ్ని ఎత్తుకుందాం... రా... నాగళ్ళను ఎక్కుపెట్టిద్దాంరా. పాదయాత్రల పనైపోయింది. ప్రపంచం గుద్దులాడుకుంటోంది... పల్లక, కళింగ నదుల నాల్కల పైనుండి నడచిరా. వైతరణిని, బ్రాహ్మణిని, మహానదిని, మహేంద్రతనయని వంశధారను, నాగావళిని, గోస్తనిని, గోదావరిని, పల్లాల్నీ, గిరులనూ, పర్రలనూ, పొలాలనూ దాటి, పాముపైనెక్కి, చేపబీపెక్కి, కండ్రచీమపైకెక్కి - పారి, పగిలి, చిరిగి, చింపేసి, చిగురేసి పోరాడాల... రా.'
'ఆశ్వీయుజ పూర్వాషాడ నవమీ! రా... దశమి వద్దు శమీపూజ చేసియాటలేద్దాం... ఎరుపెక్కుద్దాం... రా...'
కళింగుల కాళిక - గున్నమ్మ లేపుతోంది. ఉత్తరాషాఢ వచ్చేసింది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|