|
|
Articles: My Thoughts | గిడుగు బాట పట్టామా? - Site Administrator
| |
గిడుగు ఎదుర్కొన్నది - మనలోని మౌఢ్యాన్ని దురహంకారాన్ని, అప్రజాస్వామిక భావనల్ని. కాని ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నది అసలు ప్రజల భాషకే ఎసరుపెట్టి, తల్లిబాష నుండి వారిని అన్ని రంగాలలో దూరం చేయాలనే కుట్రను. ఈ విషయంలో ప్రజల పట్టనితనం ఎంత ప్రమాదకరమవుతున్నదో, ప్రభుత్వాలు భాషపట్ల అనుసరిస్తున్న వైఖరి, అంతకంటే విద్రోహకరంగా పరిణమిస్తున్నది. భావజాలపరంగా, భాషపరంగా పరాయీకరణ జరుగుతున్నది. ప్రజల తమ మూలాల్ని మరచిపోయి, సాంస్కృతికంగా తెగిన గాలి పటాల్లా తయారుకావాలనే కుట్రకు జాతి ప్రత్యక్షంగా, పరోక్షంగా బలి అవుతున్నది. ప్రపంచీకరణ నేపథ్యంలో, అంతర్జాతీయ మార్కెట్ శక్తుల విజృంభణతో అన్ని వైపుల నుంచీ ప్రజల భాషా సంస్కృతులు ముట్టడికి గురి అవుతున్నాయి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొని మనదైన జాతి సామూహిక వ్యక్తిత్వాన్ని కాపాడుకొంటూనే, ఆధునికంగా వస్తున్న అవసరాలకు తగినట్లు ఎదగాలే తప్ప, పూర్తిగా మన మూలాల్నీ, మనదైన ప్రతిదాన్నీ, కొన్ని వేల సంవత్సరాల వారసత్వాన్ని వదులుకోవడం సరికాదు. ఇందుకు తగ్గట్లుగా నేటి తెలుగు భాషోద్యమాన్ని తీర్చిదిద్దాలి.
తెలుగును పరిపాలనా భాషగా, బోధనా భాషగా తీర్చిదిద్దాలనడం సంకుచితం కాదు, అదివాదమూ కాదు. ఒక భాషా ప్రజల సహజమైన హక్కు అది. దాన్ని కాపాడడానికి సిద్ధంగాలేని ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజావ్యతిరేకమైన, ప్రజాస్వామ్య వ్యతిరేకమైన ప్రభుత్వాలు. కనుకు ఈ ప్రభుత్వాల ధోరణలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగాలి. అయితే బ్రిటీష్ పాలకులను తరిమిగొట్టడానికి జరిగిన ఉద్యమానిరి వెన్నూదన్నూ, కండా, నరాలూ అంతా ఆనాడు వెల్లివిరిసిన స్వాభిమాన ఉద్యమాల్లో ఉన్నాయి. ఇప్పుడు తెలుగువారి ముందున్న కర్తవ్యమూ ఇదే. మొత్తం జాతిని ఇందుకు సన్నద్ధం చేయాలి. ఆనాడు ప్రజలను త్యాగాలకు, పోరాటాలకు సన్నద్ధుల్ని చేస్తూనే, పరాయిపాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యోద్యమం సాగింది. ఇప్పుడు ప్రపంచీకరణ మోజులో అవసరమైన దానికీ అనవసరమైన దానికీ ప్రలోభపడుతున్న జాతి జనుల్లో జాగృతినీ, స్వాభిమానాన్నీ రగుల్కొల్పాలి. విదేశీయుల ఒత్తిడులకు లొంగిపోయి, తెలుగువారిని విదేశీశక్తులకు తాకట్టు పెటుడుతున్న మన ప్రభుత్వాలతో మనం పోరాటం చేయాలి. ధనికుల, పేదల, అగ్ర-బలహీన కులాల ప్రయోజనాల సంఘర్షణకు అవకాశమివ్వకుండా మొత్తం జాతికి అవగాహన అయ్యేవిధంగా ఉద్యమ నిర్మాణం జరగాలి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|