|
|
Articles: Short Stories | తలవంపులు - Mr. pyyetisrinivasarao srinivasulu
| |
చిన్నప్పుడు..
ఆ అమ్మాయి ఒకసారి తల్లితో సముద్ర స్నానానికి వెళ్లింది.
సముద్ర ఘోషా... ఎగిసిపడే సముద్ర కెరటాలూ ఆమెను భయపెట్టాయి. అమ్మ చెయ్యి పట్టుకుని విడువలేదు. తల్లి ధైర్యం చెప్పింది. కెరటానికి తలొంచమంది! కెరటం వచ్చినట్టే వచ్చి తల మీంచి చల్లగా జారుకుంటుందని చెప్పింది. కెరటం వెనక్కి వెళ్లాక ధైర్యంగా తలెత్తమంది!?
ఆ అమ్మాయి తండ్రి చెప్పేవాడు...
'ప్రపంచంలో గడ్డిమొక్కలం మనం. పెనుతుఫాన్లు కూడా మనల్నేం చెయ్యలేవు. మనం తలొంచుకు బతుకుతాం. మన తలల మీంచి గాలులు వీచుకుంటూ పోతాయి. గాలి తగ్గగానే మనం తలలెత్తుతాం సగర్వంగా!? మనమే ఈ సమాజ కట్టుబాట్లనీ, ఆచార వ్యవహారాలనీ శాసిస్తాం. మన వల్లే ఇంకా ఈ సమాజం ఇంత బాగా మనగలుగుతోంది. జీవితంలోని ఆటుపోట్లని భరించి, రేయింబవళ్లూ జీవితాన్ని గడిపేస్తూ నడిచేస్తాం. అదే ఏ మహావృక్షమైనా అయితే... పెనుగాలులకు కూకటివేళ్లతో పెకలించుకుపోయి కూలిపోతుంది. న్యాయాన్యాయ విచక్షణా, ధర్మాధర్మ వివేచనా కలిగి మసలుకునే మధ్య తరగతి కుటుంబంలో పుట్టడం నిజంగా మనకొక వరం! దేవుడెప్పుడూ మన పక్షమే!? ఎందుకంటే.. మనం ప్రతి బాధలోనూ అతడ్ని కొలుస్తాం. తీర్చుకోలేని కోర్కెలని తీర్చమని కోరుకుంటాం. భవిష్యత్తుపై ఏదో ఆశతో బతుకుతాం! పరువు మర్యాదల కోసం ఎంతటి త్యాగాన్నైనా చేస్తాం. మధ్యతరగతి వ్యవస్థను సజీవంగా ఉంచుతాం! మన వ్యవస్థకు మరణం లేదు. మనం చిరంజీవులం!'
ఆ అమ్మాయి పెద్దదవుతున్న కొద్దీ.. ఆమె తల్లి ఆమెకి ఎన్నో నీతులు బోధించింది.
ఆడపిల్లలకీ మగపిల్లలకీ తేడా ఉందంది.
ఆడపిల్ల నలుగురిలో నవ్వరాదంది.
ఆడపిల్ల తలొంచుకు బతకడం నేర్చుకోవాలంది.
ఇంటి వద్ద వంచిన తల బడి దగ్గర ఎత్తాలంది.
బడి దగ్గర వంచిన తల ఇంటి గుమ్మం దగ్గరే ఎత్తాలంది.
చెల్లెళ్ల భవిష్యత్తును తలుచుకుంటూ మసలమంది.
నలుగురిలో తలవంపులు తేవద్దంది.
పదుగురిలో సిగ్గుపడేలా చెయ్యొద్దంది.
************
అసలా అమ్మాయి...
ఎప్పుడు తలెత్తింది కనక?!
పెళ్లికి ముందూ తలొంచుకుంది. పెళ్లిలోనూ తలొంచుకుంది. పెళ్లయ్యాకా తలొంచుకు బతుకుతోంది!
'సిగ్గు - సింగారమంటారు' - ఆడదానికి!
'కాని, అమ్మ తనని సిగ్గుపడేలా చేయొద్దందేమిటి?!'
'తలవంచుకోవడానికీ - తలవంపులకీ తేడా ఏమిటి?!'
ఆ అమ్మాయి.. ప్రస్తుత గృహిణి...
ఎప్పుడూ తల వంచుకునే బ్రతికింది.
తలవంపుల మధ్యే బ్రతికింది.
భయం.. భయంగా బ్రతికింది.
ఎవరేమనుకుంటారోనని భయపడుతూ బ్రతికింది.
ఆంక్షల మధ్య బ్రతికింది.
కట్టుబాట్ల మధ్య పెరిగింది.
తనకంటూ - ఒక ప్రాముఖ్యత లేకుండా.. ఆత్మ లేనట్టు బ్రతికింది.
తల్లీ - తండ్రీ చెప్పిన మాట వింది.
కుంటివాడ్ని తలవంచుకు పెళ్లాడింది.
మనస్సులో ఎందరో అందగాళ్లను ఊహించుకున్నా.. వాళ్లందరినీ గుండె గోడల్లో సమాధి చేసింది.
'కులం- మతం'- అడ్డుగోడల మధ్య మనసు చంపుకుంటూ బ్రతికింది.
అప్పుడు.. తల్లిదండ్రుల ఆత్మతృప్తి కోసం తలవంచుకు బతికింది.
ఇప్పుడు...భర్త, అత్త మామల ఆత్మ తృప్తి కోసం తలవంచుకు బతుకుతోంది.
************
ఇప్పుడా అమ్మాయి...
అదే.. ఆ గృహిణి... నెల తప్పింది!!
స్కానింగ్ చేసిన డాక్టరు ఏ కళనున్నాడో రహస్యం దాయకుండా చెప్పేశాడు- 'గర్భంలో ఉన్నది ఆడపిల్లని!'
భర్త..
అత్త మామలు...
ఆడపడచూ...
అందరూ చెప్పారు!...
- 'అబార్షన్ చేయించుకో!?' అని.
ఇప్పుడామె వాళ్ల మాటకీ బుద్ధిగా తల వంచింది!
తలవంచుకు బతికే మరో జీవిని..
ఈ భూమ్మీదకు తెచ్చి... ఆమెనీ బాధపెట్టడం...
ఆమె క్షమ గల తల్లి పుడమి వంటి ఆడదే అయినా... మరో ఆడ జీవికి తల్లై ఆమెను దినదిన గండం నూరేళ్లాయుష్షులా నిత్య రోదనల మధ్య ఉంచడం ఇష్టంలేకపోయింది!
'యత్ర నార్యంతు పూజ్యంతే..'
'మాతృదేవో భవ..!'
'స్త్రీ శక్తి స్వరూపిణి...!'
మాతృగర్భ కుహరం లోంచి బయటకొచ్చిన సమస్త జీవరాసీ... వేదాలు వల్లించే పవిత్ర దేశం... స్త్రీ స్వరూపిణిగా భావించే పృథ్వి.... తల వంచుకునేలా...
సర్వ సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుని భూమిలోకి కృంగిపోయేలా...
ఒకే ఒక్క ఆర్తనాదంతో...
ఆ గృహిణి గర్భ విచ్ఛిత్తు చేయించుకుంది!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|