'నాకు బతకాలని ఉంది... బతికించండి ప్లీజ్' అంటూ దాతలను వేడుకుంటున్నాడు చిన్నారి చైతన్య కిరణ్. ఎనిమిదేళ్ళ ఈ కిరణ్ కు పుట్టిన నాలుగో నెలలోనే రక్త సంబంధమైన 'థలసేమియా మేజర్' అనే మొండి వ్యాధి దాపురించినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి కిరణ్ క్షణమొక యుగంలాగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాడు. గుంటూరు జిల్లా కండ్లకుంట గ్రామానికి చెందిన కిరణ్ తల్లిదండ్రులు నిరుపేదలు. తమ ముద్దుబిడ్డడి దుస్థితిని కళ్ళారా చూస్తూ కళ్ళలో నీరింకిపోయేలా ఏడ్వడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. చివరికి తాము చేసేదేమీ లేక కిరణ్ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు.
ఎలాంటి కష్టాలు, బాధలు తెలియకుండా ఆడుతూ, పాడుతూ, విద్యాభ్యాసం చేయాల్సిన అతి చిన్న వయస్సులో తనను క్షణక్షణం భయపెడుతున్న మృత్యువును చూస్తూ కిరణ్ తల్లడిల్లిపోతున్నాడు. శరీరంలోని రక్తం శాతం పడిపోయి మృత్యువును కళ్ళ ముందు నిలబెడుతుంది థలసేమియా మేజర్ వ్యాథి. రోగి ప్రాణాలు నిలబడాలంటే బయటి నుంచి రక్తం ఎక్కించడం మినహా మరో దారి లేదు. 'బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్' ద్వారా మాత్రమే అది సాథ్యమవుతుంది. ఈ చికిత్సకు సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. నిరుపేదలైన కిరణ్ తల్లిదండ్రులు ఈ ఖర్చును భరించే స్తోమతు లేనందువల్లే కుమారుడి బతుకుపై ఆశలు వదిలేసుకున్నారు.
కిరణ్ ఇంతకాలమూ బతికి ఉండడానికి కారణం ప్రతి 18 రోజులకూ అతని మామయ్య యలమంచిలి ఆదినారాయణ హైదరాబాద్ తీసుకువెళ్ళి రక్తం ఎక్కించడం, ఇంజెక్షన్లు ఇప్పించడమే. ఇలా 18 రోజులకు ఒకసారి 8 వేల రూపాయల వరకూ ఖర్చువుతోందని, ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేందుకు ఆదినారాయణ ఆర్థిక స్థితి కూడా సహకరించడం లేదని కిరణ్ వాపోతున్నాడు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం' ద్వారా అయినా ప్రాణాలు నిలుపుకుందామని ఆశపడిన కిరణ్ కు నిరాశే ఎదురైంది. తన వ్యాధికి సంబంధించిన వైద్యం ఆంధ్ర రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. బోన్ మ్యారో ఆపరేషన్ వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. దేవుడి దయ వల్ల తన చెల్లెలు ధరణి బోన్ మ్యారో నూటికి నూరు పాళ్ళు సరిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని కిరణ్ తెలిపాడు. ప్రసిద్ధ బోన్ మ్యారో వైద్య నిపుణుడు డాక్టర్ మామెన్ చాండీ తనకు ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చార, ఆపరేషన్ 80 శాతం విజయవంతం అవుతుందని గ్యారంటీ ఇచ్చారని చెప్పాడు. తన ఆపరేషన్ ఖర్చుల కోసం దయార్ద్ర హృదయులైన దాతలు ఆర్థిక సహాయం అందించాలని ఈ చిన్నారి చైతన్య కిరణ్ ప్రాధేయపడుతున్నాడు. దాతలిచ్చే ఆర్థిక సహాయం మాత్రమే తనకు పునర్జన్మనివ్వగలదన్న విశ్వాసంతో చైతన్య కిరమ్ ఎదురుతెన్నులు చూస్తున్నాడు.
ఆర్థిక సహాయం చేయాలనుకున్న దాతలు 'The Treasurer Christian Medical College, Vellore (207392 - C), Account No. 10404158238, బ్రాంచ్ కోడ్ 1618, వెల్లూరు టౌన్ బ్రాంచ్ కు డి.డి.లు గాని, చెక్కులు గాని పంపించవచ్చు.
Web Site : www.ychaitanya.org, E-mail : adi_yalamanchi@yahoo.com
Cell : 99665 27696, 92468 35069
Phone No : 08647 - 246118.
|