అలకల కులుకుల
అలివేలుమంగకు పోటీ అయిన
ముగ్ధ మోహన సౌందర్యంతో
సిగ్గుల సింగారాలతో కూడి
పతి సేవకై వేచియున్న
అమ్మా! పద్మావతమ్మా...
విన్నవించవమ్మా నీ
విభునికి నా విన్నపము
వేలాదివేల భక్తుల దర్శనానికై
స్వామి! నిలిచిని నిలుచొని
పాదాలెంతగా కందాయా ఏమో!
అభయహస్తమిచ్చి ఇచ్చి
స్వామి! అరిచేయి
ఆకు వలె వడిలినదేమో!
వజ్ర వైడూర్యాల
ఆభరణాలు మోసి మోసి
స్వామి! మేనింత ఎరుపెక్కినదేమో!
నడిరేయి దాటినా గానీ
తీరిక దొరకని స్వామి!
అలుపు తీర్చుకొన
నీ వడి చేరు వేళ
సేద తీర్చి...
సాంత్వన పరిచి
వలపు తేనెల విందులు చేసి
జిలుగుపైటను కట్టిన
నా పలుకుల మూటను
అందీయవమ్మా నీ విభునకు
అమ్మా! పద్మావతమ్మా...