1) జయ జయ జయ మహాదేవ శంభో సదాశివా!
పార్వతీ మనోవల్లభా చంద్రమౌళీ! మది నిండిన
నీ పాదం విడువనయ్యా, నా భారము నీదేనయ్యా!
ఈశా జగదీశా! కరుణించి కాపాడు కైలాశవాసా!!
మధురం మధురం నీ పంచాక్షరీ మంత్రం,
ఇహపర సాధన శివమంత్రం, జపింతునేమరక
భవతాప హరణా! కరుణాభరణా!
కరుణించి కాపాడు కైలాశవాసా!!
ప్రాకటముగ బ్రోచే కరుణామయుడవు నీవని
నీ పదపద్మములే గొల్తు అనన్య భక్తియుక్తులన్
నన్ను బ్రోవగా జాలము సేయకయ గౌరీమనోహరా
నాదు మొర విని ప్రోవవయా దీనబాంధవా!
జయ జయ జయ మహాదేవ శంభో సదాశివా!
కరుణించి కాపాడు కైలాశవాసా!!
2) ఏ వేదంబుల్ పఠింపగా లేదు వేదవేద్యుండవైన
నిన్న్వీక్షింపగా! నీ మహా మహిమలూహింపంగా శక్యంబె
ఎవ్వారికిన్, నీ శివ శబ్దంబె 'శివ-శక్తి' సమన్వయంబు గాదె
గౌరీవరసుధ గంగాధరా! 'ఓం'కారేశ్వర విశ్వేశ్వరా
నా పాలిటి దైవమె నీవని నీ పంచాక్షరీ మంత్రంబె
జపించుచున్, కొల్తు నిన్నెల్లవేళలన్, నా చిత్తంబునన్నిల్పి
వందనాలివె నీకయ్యా గౌరీశా! తప్పులెన్నక కదలి రావయా!
కరుణించి కాపాడు కైలాశవాసా!!
|