లోక్ సత్తా జమాఖర్చు
హైదరాబాద్ : లోక్ సత్తా పార్టీ ఇటీవలి ఎన్నికల్లో చేసిన వ్యయం వివరాలను, తనకు వచ్చిన విరాళాలను వెల్లడించింది. దేశంలో ఇంతకు ముందు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా లోక్ సత్తా తన జమా ఖర్చుల వివరాలను ప్రకటించింది. 2009 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని పార్టీకి 3,23,73,830 రూపాయల విరాళం వచ్చిందని, అందులో 3,16,10,095 రూపాయలు చట్టబద్ధమైన వివిధ రూపాల్లో ఖర్చుచేసినట్లు లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ వివరించారు. శనివారంనాడు మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ డబ్బులో ఒక్క పైసా కూడా నల్లధనం లేదని, అంతా చెక్కు రూపంలో లేదా రసీదు ఇచ్చి తీసుకున్నదే అని తెలిపారు. వ్యయాన్ని కూడా తమ పార్టీ పారదర్శకంగా చేసిందని స్పష్టం చేశారు.
పార్టీ ఎన్నికల ఖర్చులో కేంద్ర కార్యాలయం నుంచి ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచారానికి 2,25,83,670 రూపాయలు ఖర్చు చేసినట్లు జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. ప్రచార సామగ్రికి 37,99,510 రూపాయలు, ప్రయాణాలకు రూ. 5,09,546, ప్రచార ఖర్చుకు రూ.44,95,276, సమావేశాలకు రూ. 80,453, ఇతర కార్యక్రమాలకు రూ.1,32,640 ఖర్చయినట్లు జెపి వివరించారు. తాను పోటీ చేసిన కూకట్ పల్లిలో మొత్తం రూ.4,92,326 ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ ఖర్చులో బహిరంగ సభలకు రూ.6,616, ప్రచార సామగ్రికి రూ.1,89,742, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రచారానికి రూ. 32,604, వాహనలకు రూ. 92,378, ఇతర అవసరాల నిమిత్తం రూ.1,70,985 వెచ్చించినట్లు తెలిపారు.
రాజకీయాల్లో ఖర్చుకు, అవినీతికి దగ్గర సంబంధం ఉందని, డబ్బు వెదజల్లి ప్రజలను ప్రలోభ పెట్టి ఎలాగోలా గెలిచి అనంతరం అంతకు కొన్ని రెట్లు దండుకోవడమే రాజకీయంగా మారిపోయిందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జెపి ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనాన్ని చట్ట విరుద్ధంగా ఖర్చు చేసేసి ఎన్నికల్లో గెలవడమే రాజకీయ సంస్కృతిగా మారిందన్నారు. ఈ ధన రాజకీయాలను మారిస్తే తప్ప తిరిగి రాజకీయాల్లో ప్రజాస్వామిక విలువలను ప్రతిష్టించడం సాధ్యం కాదన్నారు.
ఎన్నికల్లో లోక్ సత్తా సంఖ్యాపరమైన విజయాలు సాధించాలంటే 40 కోట్ల రూపాయలు కావాలని ఎన్నికలకు నాలుగు నెలల ముందే ప్రకటించినట్లు జెపి చెప్పారు. అయితే, నల్లధనాన్ని విరాళంగా తీసుకోవడానికి తాము నిరాకరించామని, అందువల్ల పదో వంతు మాత్రమే డబ్బు సమకూరిందన్నారు. దీనితో ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేకపోయామన్నారు. ప్రజలకు లోక్ సత్తా భావజాలాన్ని చేర్చడం వరకూ మాత్రమే తాము సఫలమయ్యామన్నారు.
Pages: 1 -2- News Posted: 13 June, 2009
|