16 లోగా లోక్ సభకు బిల్లు న్యూఢిల్లీ : లోక్ సభలో మహిళా బిల్లును మార్చి 16 తేదీలోగా ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పి కె బన్సాల్ వెల్లడించారు. బిల్లుపై కొన్ని రాజకీయ పక్షాలు తీవ్ర గందరగోళం సృష్టిస్తున్న నేపథ్యంలో కొద్దికాలం విరామం తరువాత సభలో పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు మంగళవారం రాజ్యసభలో ఆమోదం పొందిందని, లోక్ సభలో కూడా ఆమోదం లభిస్తుందని ఆయన అన్నారు. బుధవారం బన్సాల్ మీడియాతో మాట్లాడారు. ఎస్పీ, ఆర్జేడీ వంటి పక్షాలు లోక్ సభలో కూడా మహిళా బిల్లును వ్యతిరేకించినా ఆమోదం పొందుతుందని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.
పెద్దల సభలో బిల్లుపై ఓటింగ్ ను బహిష్కరించిన తృణమూల్ కాంగ్రెస్ ఈ సారి లోక్ సభలో మాత్రం పాల్గొంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. రాజ్యసభలో ఏడుగురు సభ్యులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీని ఆ సభ్యులు కలసి తమ వ్యవహార తీరు పట్లు విచారం వ్యక్తం చేస్తే సస్పెన్షన్ ను తొలగిస్తామని ఆయన చెప్పారు. సభా మర్యాదలను పాటించనందునే వారిపై సస్పెన్షన్ వేటు వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
News Posted: 10 March, 2010
|